Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మౌనంగా ఉండాల్సింది.. !

అయితే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం వివాదంగా మార‌డంతో ఈ విష‌యంలో ఎన్డీయేను స‌మ‌ర్థిస్తున్న కొన్ని పార్టీలు సైతం పెద‌వి విరుస్తున్నాయి.

By:  Garuda Media   |   28 Sept 2026 10:50 AM IST
జ‌గ‌న్ మౌనంగా ఉండాల్సింది.. !
X

కేంద్రంలోని ఎన్డీయేకి పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా.. ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామి కాక‌పోయినా.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని ఎన్డీయేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టి స్తోంది. రాష్ట్రప‌తి నుంచి ఉప‌రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు.. ప‌లు ర‌కాల బిల్లుల నుంచి స‌మ‌ర్థించే విష‌యాల వ‌ర‌కు కూడా కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు వైసీపీ మ‌ద్ద‌తు తెలుపుతోంది. ఇది 2014 నుంచి కొన‌సాగుతున్న ప్ర‌క్రియే.

అయితే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం వివాదంగా మార‌డంతో ఈ విష‌యంలో ఎన్డీయేను స‌మ‌ర్థిస్తున్న కొన్ని పార్టీలు సైతం పెద‌వి విరుస్తున్నాయి. కేంద్రం నుంచి ఎన్నిక‌ల సంఘం వ‌ర‌కు స‌మాధానం చెప్పాల‌ని కోరుతున్నాయి. ఇక‌, కొన్ని పార్టీలు.. అంటే బీఆర్ ఎస్‌, డీఎంకే వంటివి మౌనంగా ఉన్నాయి. కేంద్రం ఎక్క‌డ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుందోన‌న్న బెంగ ఆయా పార్టీల్లో క‌నిపిస్తోంది. దీంతో ఆయా పార్టీలు మౌనంగా ఉంటున్నాయి.

కానీ, ఈ స‌మ‌యంలో అనూహ్యంగా జ‌గ‌న్ స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న సుదీర్ఘ పోస్టు పెట్టారు. దీనిలో ఒక‌వైపు కేంద్రంపై సునిశిత విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే మ‌రోవైపు.. ఎన్నిక‌ల సంఘం పార‌ద‌ర్శ‌క‌త‌ను కూడా ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారం జాతీయ‌స్థాయిలో రాజుకుంది. జ‌గ‌న్ చేసిన పోస్టును కొన్ని మీడియా ఛానెళ్లు ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నాయి. ఎన్డీయే కు అంశాల వారీగా మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీలుకూడాఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నాయ‌ని వారు చెబుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ చేసిన పోస్టులో కీల‌క సూచ‌న చేశామ‌ని అనుకుంటున్నా.. అది కేంద్రానికి మంట‌పుట్టిస్తోంది.

ఎందుకంటే.. ఆ లైన్‌.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండ‌డ‌మే. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌ను ఎంపిక చేసే క‌మిటీలో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిని కూడా చేర్చాల‌న్న‌ది జ‌గ‌న్ సూచ‌న‌. దీనినే కాంగ్రెస్ పార్టీ స‌హా.. మోడీపై నిప్పులు చెరుగుతున్న వారు కోరుతున్నారు. ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఉన్న జ‌గ‌న్ కూడా ఈ వాద‌న‌ను తెర‌మీదికి తీసుకురావ‌డం, స్కూలు-విద్యార్థి-ఇన్‌విజిలేట‌ర్ సూత్రాన్ని ఆపాదించ‌డం వంటివి కేంద్రానికి మంట పుట్టిస్తున్నాయి. ద‌క్షిణాది నుంచి కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తున్న వైసీపీ పార్టీ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని కూడా అంటున్నారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.