Begin typing your search above and press return to search.

జగన్ పులివెందుల ఆమెకు అప్పగించేస్తున్నారా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1955లో పులివెందుల నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక వరసగా అక్కడ నుంచి రెండు సార్లు హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన ఘనత దివంగత వైఎస్సార్ కే దక్కింది.

By:  Satya P   |   3 Sept 2025 8:00 AM IST
జగన్ పులివెందుల ఆమెకు అప్పగించేస్తున్నారా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1955లో పులివెందుల నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక వరసగా అక్కడ నుంచి రెండు సార్లు హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన ఘనత దివంగత వైఎస్సార్ కే దక్కింది. ఆయన 1978, 1983, 1985లలో గెలిచి తొలి హ్యాట్రిక్ కొట్టారు. అలాగే 1999, 2004, 2009లలో సైతం మూడు సార్లు వరసగా గెలిచి రెండోసారి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టారు. ఆయన తరువాత వైఎస్ జగన్ 2014, 2019, 2024లో వరసగా గెలిచి తొలి హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆయన అక్కడ మరిన్ని సార్లు పోటీ చేసి గెలవాల్సి ఉంది కాబట్టి తండ్రి రికార్డు ని అధిగమిస్తారేమో చూడాల్సి ఉంది. అయితే పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. దానిని బద్ధలు కొట్టాలని టీడీపీ కూటమి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

రిపేర్లకు దిగిన జగన్ :

తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. అదే సమయంలో వైసీపీని మరింతగా దెబ్బ తీయాలని 2029 నాటికి అక్కడ టీడీపీ జెండా ఎగరేయాలని ఆరాటపడుతోంది. దాంతో పులివెందుల మునిసిపాలిటీ మీద కూడా ఫోకస్ పెట్టేసింది. ఈ నేపథ్యంలో జగన్ రిపేర్లు మొదలుపెట్టారు. పులివెందులకు తాజాగా వెళ్ళిన జగన్ అక్కడ పార్టీ నాయకులతొ మాట్లాడారు, ప్రజా దర్బార్ ని నిర్వహించి అందరి సమస్యలు తెలుసుకున్నారు.

ఆమెకు బాధ్యతలు :

ఇక జగన్ రాష్ట్ర స్థాయిలో వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంది. దాంతో పులివెందుల బాధ్యతలు తన మాదిరిగా చూసే నమ్మకం అయిన వారి కోసం చూసి చివరికి ఆమెను ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు జగన్ సతీమణి వైఎస్ భారతి. ఆమె పులివెందులలో జగన్ లేని లోటుని తీరుస్తూ అక్కడ ప్రజలతో నేరుగా మమేకం అవుతారు అని అంటున్నారు. పులివెందుల ప్రజలకు వైఎస్ కుటుంబంతో మంచి భావోద్వేగమైన బంధం ఉంది. దానిని వైఎస్ వివేకానందరెడ్డి చక్కగా కొనసాగించారు ఆయన తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి ఆ తరహాలో పని చేయలేక పోతున్నారు అని అంటున్నారు అది తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి ద్వారా రుజువు అయింది అని వైసీపీ అధినాయకత్వం గ్రహించి భారతినే నేరుగా రంగంలోకి దింపుతోంది అని అంటున్నారు.

అన్నీ స్వయంగా చూసుకుంటూ :

తాజాగా జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను భారతి స్వయంగా చూసుకున్నారు. పులివెందులలో ఆమె ప్రతీ కార్యకర్తను పలకరిస్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు దాంతో ఆమె పులివెందులలో జగన్ తరఫున పూర్తిగా రంగంలోకి దిగి బాధ్యతలు చూస్తారు అని అంటున్నారు. ఆమెకు ఇది కొత్త కూడా కాదు అని చెబుతున్నారు. ఆమె వైఎస్ జగన్ ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఆయన తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఆమె అందరికీ అలా బాగా పరిచయం ఉన్న వారే కావడంతో పులివెందులలో ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ పట్టు జారకుండా చూసుకోవడమే కాదు వైఎస్సార్ కుటుంబం ఎమోషన్ ని కంటిన్యూ చేయాలన్నది కూడా ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

కుప్పం ప్లాన్ తోనే :

ఇక కుప్పంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా అంతా తాను అయి కార్యకర్తలకు కలుస్తారు. ఆమె వీలు అయినప్పుడల్లా అక్కడకి వెళ్ళి పార్టీ కష్ట సుఖాలు చూస్తారు కార్యకర్తలతో మంచిగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూంటారు ఇపుడు జగన్ కూడా అదే విధంగా తన సతీమణిని రంగంలోకి దింపుతున్నారు అని అంటున్నారు. మరి దీని వెనకాల వేరే ఏదైనా ఆలోచన ఉందా వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీకి దిగుతారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లోనే జగన్ జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం సాగింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.