Begin typing your search above and press return to search.

వినతుల వెల్లువ. జగన్ ని అసెంబ్లీకి వెళ్ళమనేనా ?

అక్కడే ప్రభుత్వం మొత్తం ఉంటుంది. ఏ అంశం అయినా అక్కడ ప్రస్తావిస్తే కరెక్ట్ చానల్ ద్వారా ప్రభుత్వానికి చేరుతుందని తక్షణ పరిష్కారానికి సైతం వీలు ఉంటుందని అంటున్నారు.

By:  Satya P   |   30 July 2026 9:36 AM IST
వినతుల వెల్లువ. జగన్ ని అసెంబ్లీకి వెళ్ళమనేనా ?
X

వైసీపీ అధినేతకు ఈ మధ్య వినతులు ఎక్కువ అయ్యాయి. ఆయన తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉంటే చాలు వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం నిత్యం ఆయన్ని కలుస్తూ వస్తున్నారు. జగన్ సైతం వారికి అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. వారంతా కలసి ప్రతిపక్ష నేతకు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. తమ గోడు ప్రభుత్వానికి చెప్పి నిలదీయాలని గట్టిగా అభ్యర్థిస్తున్నారు. జగన్ సైతం ఆ మేరకు వారికి హామీ ఇస్తున్నారు. ఇదంతా ప్రతీ రోజూ సాగుతున్న వ్యవహారంగా మారింది. సాధారణంగా ఇది ఎక్కడైనా జరిగితే ప్రతిపక్షం ఎక్కడ ఉంటే అక్కడికి సమస్యలతో ప్రజలు వస్తారు. తమ గోడు చెప్పుకుంటారు. ఎందుకంటే బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అని. ఈ మధ్యనే పొగాకు రైతులు, ఆక్వా రైతులు అలాగే తాజాగా డాక్యుమెంట్ రైటర్లు జగన్ ని కలిసి తన బాధలు చెప్పుకున్నారు. వారికి జగన్ సానుకూలంగా హామీ ఇచ్చారు.

సరైన వేదిక అదే :

అయితే ప్రతిపక్షానికి వినతులు అన్నీ ఇవ్వడం అంటే అసెంబ్లీలో వాటిని ప్రస్తావిస్తారు అని అంటున్నారు. వైసీపీ అయితే రెండేళ్ళుగా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఏ ప్రభుత్వం అయినా ప్రజా సమస్యలు కచ్చితంగా ఉంటాయి. వాటిని ప్రతిపక్షమే పట్టుకుని అసెంబ్లీలో ప్రస్తావిస్తుంది. అందులో వీలైనవి ప్రభుత్వం కూడా ఆలోచించి పరిష్కరిస్తుంది. అలా ప్రతిపక్షానికి పేరు కూడా వస్తుంది. అయితే వైసీపీ వద్దకు వెళ్తున్న వినతుల మీద జగన్ అండ్ కో అయితే మీడియా ముఖంగానే ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు వేస్తోంది. కొన్ని సందర్భాల్లో జగన్ నేరుగా బాధితులను కలుస్తూ పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇవి అన్నీ ఓకే కానీ వీటి కంటే అసలైన వేదిక అసెంబ్లీ అని అంటున్నారు. అక్కడే ప్రభుత్వం మొత్తం ఉంటుంది. ఏ అంశం అయినా అక్కడ ప్రస్తావిస్తే కరెక్ట్ చానల్ ద్వారా ప్రభుత్వానికి చేరుతుందని తక్షణ పరిష్కారానికి సైతం వీలు ఉంటుందని అంటున్నారు.

వెళ్ళి తీరాల్సిందేనా :

ఎవరైనా తమ సమస్యలకు పరిష్కారం కావాలని కోరుకుంటారు. దాంతో వారు ప్రతిపక్షం వైపు చూస్తారు. మరి వైసీపీ అధినాయకత్వానికి ఇచ్చిన వినతుల మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించకపోయినా లేక పరిష్కారం కాకపోయినా వారిలో నిరాశ కలుగుతుంది అని అంటున్నారు. దాంతో తమ గోడు వెళ్ళబోసుకున్నా ఫలితం లేదని భావిస్తారు కూడా. అందుకే వైసీపీ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అయినా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉందని అంటున్నారు. జగన్ తో పాటుగా పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే ప్రజల సమస్యల ప్రస్తావనే కాదు వైసీపీకి ఓటేసిన 40 శాతం ఓటర్ల గొంతు కూడా గట్టిగా వినిపిస్తుంది అని అంటున్నరు. ఈ విషయంలో వైసీపీ ఏమి ఆలోచిస్తోందో తెలియదు కానీ అసెంబ్లీకి వెళ్ళడం అన్నది ఆ పార్టీకే మేలు అని అంటున్నారు. సమస్యల పట్ల వైసీపీ సానుకూలంగా ఉందని జనాలు భావిస్తారు. పరిష్కారం అయితే క్రెడిట్ వస్తుంది. లేకపోయినా ప్రభుత్వానిదే తప్పు అనుకుంటారు. ఆ విధంగా వైసీపీకి రెండిందాల లాభం అని అంటున్నారు. అయితే వైసీపీ అనుకూల మీడియా మాత్రం జగన్ వద్దకు వెల్లువలా వినతులు ఇస్తున్నారు జనాలు వస్తున్నారు అన్నది హైలెట్ చేస్తోంది కానీ అసెంబ్లీలో వీటిని ప్రస్తావించాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తే బాగుంటుందని అంటున్నారు.