Begin typing your search above and press return to search.

రొటీన్ అవుతోంది బాస్ !

వైసీపీ అధినేత జగన్ పెడుతున్న ప్రెస్ మీట్లలో అధికార కూటమి మీద విమర్శలు రొటీన్ గా ఉంటున్నాయని టాక్ నడుస్తోంది.

By:  Satya P   |   5 Dec 2025 3:00 AM IST
రొటీన్ అవుతోంది బాస్ !
X

వైసీపీ అధినేత జగన్ పెడుతున్న ప్రెస్ మీట్లలో అధికార కూటమి మీద విమర్శలు రొటీన్ గా ఉంటున్నాయని టాక్ నడుస్తోంది. పైగా నెలకో నెలన్నరకో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్లలో అప్పటికే జరిగిపోయి చాలా కాలం అయిన అంశాల మీద వైసీపీ మార్క్ విమర్శలు వివరణలు ఇస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అవుట్ డేటెడ్ అయిపోతున్నాయని అంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో నిన్నటిది నిన్నే. నేడు నేడుగానే ఉంటుంది. పైగా ఇది సోషల్ మీడియా యుగం. దాంతో ఎంత ఫ్రెష్ న్యూస్ అయినా సెకెన్లలో స్టేల్ అయిపోతోంది.

రెగ్యులర్ గానే :

పాలిటిక్స్ అంటే రణ భూమిని వదలకూడదు, అటూ ఇటూ బాణాలు వస్తూనే ఉంటాయి. అలుపూ సొలుపూ లేకుండా వాటికి తిరుగు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే రాజకీయం పండుతుంది. జనాల బుర్రలోకి కూడా అది వెళ్తుంది. కానీ వైసీపీ అధినేత మాత్రం ఒక నెల రోజుల పాటు జరిగిన వాటిని అన్నీ క్రోడీకరించి ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆయన ప్రతీ అంశానికి వివరణ ఇస్తూ వైసీపీ శైలిలో వాటికి జవాబు చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఎప్పటికప్పుడు జవాబు చెబుతూ ఉంటే బాగుంటుంది కదా వాటికి పదును కూడా ఎక్కువగా ఉంటుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

విమర్శలు ఓకే :

ఇక ప్రభుత్వం మీద ప్రతిపక్షం విమర్శలు చేయడం చాలా కామన్. ఆ విధంగా జగన్ చేయడం కరెక్టే. కానీ అదే పనిగా ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప వైసీపీ తరఫున చేసినది చేయబోయేది కూడా చెబితే కదా పార్టీ జనంలోకి వెళ్ళేది, అక్కడ ఉండేది అన్నది కూడా ఒక మాట ఉంది. ఎంతసేపూ చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటే అది అంతిమంగా లాభం కంటే నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. ఏ పార్టీ అయినా జనంలో ఉంటూనే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పోగు చేయాలి. అది కూడా జనంలో వచ్చే మార్పుని చూసిన మీదట చేస్తేనే పండుతుంది.

అక్కడ కనిపిస్తేనే :

జగన్ ప్రెస్ మీట్ల మీద మొదట్లో ఉన్న ఫోకస్ అటెన్షన్ ఇపుడు తగ్గిందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక జగన్ అసెంబ్లీలో కనిపించాలని కోరుకునే వారు అధికంగా ఉన్నారు. అలాగే ఆయన జనంలో ఉండాలని కూడా బలంగా కోరుకుంటున్నారు. గ్రౌండ్ లో ఉంటూ చేసే విమర్శలకు విలువ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. అలాగే అసెంబ్లీలో మాట్లాడితేనే అందం అర్ధం పరమార్ధం అని చెబుతున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం మీడియా మీట్ లను నమ్ముకుంది. కానీ అంతకంతకు వాటిని కూటమి కూడా పట్టించుకుని ఖండించే పరిస్థితి కూడా లేకపోతోంది అని అంటున్నారు సో వైసీపీ ఇక కొత్త దారులలో సర్కార్ మీద సమరం చేయాల్సిందే అని అంటున్నారు.