వైసీపీ పాలిటిక్స్: జగన్ ట్రెండ్ తగ్గలేదు.. !
2025లో వైసిపి రాజకీయాలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాయని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం జగన్ ప్రయత్నించారు.
By: Garuda Media | 24 Dec 2025 11:00 PM IST2025లో వైసిపి రాజకీయాలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాయని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం జగన్ ప్రయత్నించారు. అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఆయన నియంత్రంచగలిగారు. రాజకీయంగా ఈ వ్యవహారాలు తీవ్రస్థాయిలో విమర్శలకు దారి తీసినప్పటికీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటానికి దిగారు. అదేవిధంగా అధికార పక్షాన్ని కూడా ఒకానొక సందర్భంలో ఇరుకున పడేశారు.
ప్రతిపక్షం లేకుండానే సభలు నిర్వహించడాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లే క్రమంలో అనుకూల మీడియాను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించారు. అదేవిధంగా రైతుల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. పొగాకు, మిర్చి, మామిడి రైతుల సమస్యలపై జగన్ గళం విప్పారని చెప్పాలి. ఆయా సమస్యలను ప్రస్తావిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు జగన్కు అనుకూలంగా మారాయి. ఓ రకంగా ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే జగన్ వెళ్లి ఉండే పరిస్థితి వచ్చేది కాదని రాజకీయంగా చర్చ కూడా నడిచింది.
ఇక, జగన్ ట్రెండ్ విషయానికి వస్తే పార్టీ పరంగా రాజకీయాల పరంగా జగన్కు తిరుగు లేదన్న వాదన వినిపించింది. జగన్ ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. ఆయన గురించి భారీ ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ముఖ్యంగా అసెంబ్లీకి రాకపోవడాన్ని రాజకీయ వర్గాలు భారీ స్థాయిలో చర్చించాయి. అదేవిధంగా తాడేపల్లిలోనూ బెంగళూరు పర్యటనల సమయంలో కూడా జగన్ గురించి ప్రధానంగా మీడియాలో చర్చ నడిచింది. ఓ రకంగా చెప్పాలంటే జగన్ కూర్చున్నా.. నుంచున్నా కూడా వార్త అయిందన్న వాదన వినిపించింది.
ఇక పులివెందుల పర్యటనలు, కడపలో పార్టీ సమన్వయం తదితర అంశాలపై దృష్టి పెట్టినా.. అదేవిధంగా తాడేపల్లిలో పార్టీ నాయకులతో తరచుగా సమావేశాలు నిర్వహించినా.. జగన్ తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం ద్వారా పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కూడా ఆయన చేశారని చెప్పాలి. మొత్తంగా 2025లో జగన్ ట్రెండ్ ఏమాత్రం తగ్గలేదన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. 11 స్థానాలకు పరిమితం అయినప్పటికీ ఉత్సాహంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది ఉన్న నైరాస్యాన్ని దాదాపు తొలగించే ప్రయత్నం చేశారు.
