మెజారిటీ జిల్లాల్లో.. 'కూటమి' రక్షాబంధన్.. !
అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన రక్షాబంధన్... కలివిడికి.. కలిసి ప్రయాణం చేసేందుకు కూడా ప్రతీక అన్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 28 Aug 2026 7:21 PM ISTఅన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన రక్షాబంధన్... కలివిడికి.. కలిసి ప్రయాణం చేసేందుకు కూడా ప్రతీక అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని కూటమికి ఆపాదిస్తే.. పలు జిల్లాల్లో కూటమి పార్టీల మధ్య సఖ్యత పెరుగుతోంది. నాయకుల మధ్య వైరాలు దాదాపు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. వచ్చే ఎన్నికలే!. ఎందుకంటే.. వైసీపీ అధినేత జగన్ పుంజుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఓ సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైంది.
కూటమి ఐక్యంగా ఉంటే.. బలంగా ముందుకు సాగితే.. ప్రజలకు బలమైన సంకేతాలు ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిదే విజయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఫలితం ఎలా ఉన్నా.. మరోసారి కూటమి మాత్రం అధికారం దక్కించుకుంటుందని పేర్కొంది. అలా కాకుండా.. కూటమిలో లుకలుకలు పెరిగి.. నాయకుల మధ్య తేడా కొడితే మాత్రం అది తీవ్ర ఇబ్బందులు తీసుకువస్తుందని పేర్కొంది. అంతేకాదు.. జగన్ పుంజుకునేందుకు.. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక, అడపా దడపా వైసీపీ అధినేత జగన్ బయటకు వస్తున్నారు. పార్టీనాయకులు, రైతులు, ఇతర సమస్యలపై బాధితులను పరామర్శించే పేరుతో జగన్ పర్యటనలు చేస్తున్నారు. ఆయా పర్యటనల సమయంలో జనాలు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకువస్తున్న జనాలను పరిశీలిస్తే.. డబ్బులు ఇచ్చి తీసుకువచ్చారని తొలుత అనుకున్నా.. అది కాదని శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు అర్ధమైంది. ఇది కూడా కూటమి నాయకుల కలివిడి కారణమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
మొత్తంగా రెండు ప్రధాన కారణాలు.. కూటమిలో రక్షాబంధన్‌ను బలోపేతం చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా పొరపాట్లు జరిగి రాష్ట్రంలో కూటమి స్థానంలో వైసీపీ అధికారంలోకి వస్తే.. తమకు ఇబ్బందులు తప్పవని గుర్తు చేసుకుంటున్నారు. 2019-24 మధ్య కాలంలో పార్టీ నాయకులు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు. కార్యకర్తలు ఎదుర్కొన్న అవమానాలు.. కేసులను కూడా తెరమీదికి తెస్తున్నారు. దీంతో మెజారిటీ జిల్లాల్లో కూటమి పార్టీల నాయకులు కలిసి ఉండేందుకు.. కలివిడిగా ముందుకు సాగేందుకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
