''జగన్ ఊరుకోరు: ఇంచార్జ్లను మార్చేస్తారు.. ! ''
వైసీపీ ఘోర పరాజయం తర్వాత జిల్లాలు, నియోజకవర్గాల ఇన్చార్జిల వ్యవహారశైలిపై పార్టీలో విమర్శలు పెరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాబలం పట్టించుకోలేదని, కొన్ని చోట్ల పార్టీ నిధులు సైతం సక్రమంగా వినియోగించలేదని ఓడిపోయిన నేతలు, క్షేత్రస్థాయి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జిలను మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మార్పులు నిజంగా జరుగుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 8 Nov 2026 9:00 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడికక్కడ నాయకులను ఎంపిక చేసే విధానం నుంచి గెలిపించుకునే వరకు కూడా పార్టీ ఇంచార్జిలు ఉదాసీనంగా వ్యవహరించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొన్ని చోట్ల పార్టీ డబ్బులు ఇచ్చినా వాటిని పంచలేదన్న వాదన ఉంది. అందుకే.. దెబ్బతిన్నామన్న వాదన కూడా ఉంది. ఇది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కంటే కూడా పార్టీలోనే ఓడిపోయిన నాయకులు అదేవిధంగా క్షేత్రస్థాయి నాయకులు కూడా చెబుతున్న మాట. ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించి గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని జగన్ ఆది నుంచి చెబుతూ వచ్చారు.
అంతే కాదు ఒకవేళ అభ్యర్థులు లేకపోతే సొంత కుటుంబ సభ్యులను ఆయన రంగంలోకి దింపాలని సూచించారు. అయితే ఈ విషయంపై క్షేత్రస్థాయిలో కసరత్తు అయితే జరగలేదు. అంతేకాదు కొంతమంది ఇన్చార్జిలు తెరవెనుక మంతనాలు చేసి కొంత మందిని ఎంపిక చేశారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఉదాహరణకు తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దగా ప్రజాబలం లేని నాయకులను ఎంపిక చేశారు అని అంటున్నారు. ఇదంతా కావాలని చేశారని క్షేత్రస్థాయి నాయకులు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత అందరి దృష్టి జిల్లాలు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్చార్జిల పైన పడింది. మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఇన్చార్జిలు వ్యవహరించిన పాత్ర రాజకీయంగా వైసిపిని తీవ్రంగా కుదిపేస్తోంది. అసలు ఏం జరిగింది అనే అంశంపై పార్టీలో అంతర్మథనం సాగుతోంది. అంతేకాదు అవసరమైతే జిల్లాల ఇన్చార్జిలను మార్చేందుకు కూడా జగన్ సిద్ధపడుతున్నారని సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం ఉన్న అసంతృప్తిని చల్లారిచేందుకు మాత్రమే జరుగుతోందని ఇన్చార్జిలను మార్చే ఉద్దేశం లేదని మరికొందరు చెబుతున్నారు.
ఒకవేళ మార్చాలి అనుకున్నా బాధ్యతలు చేపట్టేవాళ్ళు ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా పార్టీకి లేకుండా పోయారని అంటున్నారు. మొత్తంగా చూస్తే పార్టీ పరంగా సీరియస్ గా ఉన్నామని చెబుతున్నారు. కానీ నాయకుల పరంగా చూస్తే చాలా లోపాయి కారీగా ఏదో చేశారని వాదనను వారు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు గుంటూరు నుంచి అనంతపురం వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడలో సీనియర్ నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అయినా ఇక్కడ పార్టీ మేయర్ పీఠాన్ని కోల్పోయింది దీంతో ఇన్చార్జిలపైనే ఇప్పుడు అందరు దృష్టిపడింది. వారిని మార్చాలన్నది క్షేత్రస్థాయి నాయకుల మాట. మారుస్తామని పార్టీ చెబుతోంది. కానీ ఇది ఏ మేరకు జరుగుతుందనేది చూడాలి.
