పాదయాత్రపై కమిటీలు.. ఏడాది ముందే ప్రిపరేషన్.. !
వైసీపీ అధినేత జగన్.. పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది.. ఆయన మాటలో చెప్పాలంటే కళ్లుమూసి తెరిచేలోగా వచ్చేస్తుంది.. కాబట్టి.. జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
By: Garuda Media | 23 March 2026 8:00 AM ISTవైసీపీ అధినేత జగన్.. పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది.. ఆయన మాటలో చెప్పాలంటే కళ్లుమూసి తెరిచేలోగా వచ్చేస్తుంది.. కాబట్టి.. జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సో.. అప్పటికి రెడీ చేసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ప్రధానంగా పాదయాత్ర అంటేనే డబ్బులు కుమ్మరించక తప్పదు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఖర్చు పెట్టాలి. ప్రచారం నుంచి ప్రజలను కదిలించే వరకు కూడా అన్నీ రూపాయితోనే సాకారం అవుతాయి.
ఈ నేపథ్యంలో కాసుల బాధ్యత ఎవరిది? అనేది ఇప్పుడు పాదయాత్రపై జరుగుతున్న చర్చ.. దీనిపై అంతర్గతంగా కమిటీ వేస్తున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆర్థిక నిర్వహణ, పాదయాత్ర పర్యవేక్షణ, ప్రచార కమిటీ... కార్యకర్తల కమిటీ ఇలా.. ఐదారు కమిటీలను వేయనున్నారు. వాటి ద్వారా పాదయా త్రను సక్సెస్ చేయాలని తలపోస్తున్నారు. వీటిలో అత్యంత కీలకమైంది.. ఆర్థిక నిర్వహణ. డబ్బులు తెచ్చేవారు.. ఇచ్చేవారు అవసరం.
అంతేకాదు.. గతంలో పాదయాత్రకు.. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిధులు వెచ్చించారు. ఈ దఫా అసెంబ్లీ + పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఖర్చు భరించే నాయకులను ఏరి ఎంపిక చేయాలన్నది పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. కానీ.. గతానికి ఇప్పటికి తేడా ఉంది. కూటమి పార్టీలు ఐక్యంగా ఉండడం .. పవన్ కల్యాణ్, లోకేష్ ఇమేజ్ వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే.. వైసీపీకి మొగ్గు చూపేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారా? అనేది ప్రశ్న.
దీని ఆధారంగానే పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. గతంలో టీడీపీ ఒక్కటే అధికారంలో ఉంది కాబట్టి(బీజేపీతో విడిపోయింది)... జగన్ ప్రభావం.. ప్రభంజనం కనిపించింది. కానీ, ఇప్పుడు మూడు పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొమ్ములు వెచ్చించే వారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వస్తోంది. జగన్ గెలుపుపై ధీమా ఉంటేనే వారు అడుగులు ముందుకు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏడాది ముందుగానే ఆర్థికంగా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
