Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. వైసీపీకి పాత రోజులు వ‌చ్చేనా?

2024 ఎన్నికల ఓటమి తర్వాత ముఖ్యంగా సంక్షేమాన్ని భారీగా అమ‌లు చేశామ‌ని చెప్పిన త‌ర్వాత కూడా.. వైసీపీని ప్ర‌జ‌లు 11 స్థానాల‌కు ప‌రిమితం చేశారు.

By:  Garuda Media   |   13 Sept 2026 5:00 PM IST
జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. వైసీపీకి పాత రోజులు వ‌చ్చేనా?
X

వైసీపీ అధినేత జగన్ 2027 సెప్టెంబ‌రు లేదా అక్టోబ‌రులో పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ద‌ర‌మిలా.. ఈ పాదయా త్రతో వైసీపీకి పునర్వైభవం వస్తుందా అనేది ప్రస్తుతం రాజకీయ వ‌ర్గాల్లోనే కాదు.. వైసీపీ నాయ‌కుల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా `పాదయాత్ర 2.0`ను నిర్వహించనున్నట్లు జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా.. త‌న ఇమేజ్‌ను పెంచుకోవ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మిని ఓడించి.. తాను అధికారంలోకి రావాల‌న్న‌ది ఆయ‌న పెట్టుకున్న ప్ర‌ధాన ల‌క్ష్యం.

సానుకూలత‌లు..

2024 ఎన్నికల ఓటమి తర్వాత ముఖ్యంగా సంక్షేమాన్ని భారీగా అమ‌లు చేశామ‌ని చెప్పిన త‌ర్వాత కూడా.. వైసీపీని ప్ర‌జ‌లు 11 స్థానాల‌కు ప‌రిమితం చేశారు. దీంతో కేడ‌ర్ స‌హా నాయ‌కులు నిరాశ‌లో కూరుకుపోయారు. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర నాయకుల్లో కొంత మేర‌కు జోష్ నింపుతుందని పార్టీ భావిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లోకీల‌క నాయ‌కులు పార్టీ కాడి ప‌డేసిన నేప‌థ్యంలో ఉన్న నాయ‌కుల‌కు కొత్త‌వారు తోడ‌వుతారా? లేదా? అనేది చూడాలి. ఇక‌, ఈ యాత్ర ద్వారా కూటమి ప్రభుత్వ విధానాలు, హామీల వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడం ద్వారా.. వైసీపీ పాల‌న‌ను తిరిగి తెచ్చేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది.

ఒక‌సారి చేస్తే..

నిజానికి పాద‌యాత్ర‌లు ఒక్క‌సారిఫ‌లిస్తాయి. ప‌దే ప‌దే చేస్తే.. ప్ర‌జ‌లు ఏమేర‌కు విశ్వ‌సిస్తార‌న్నది ప్ర‌శ్నార్థ‌క‌మే. గ‌తంలో 2018-19 మ‌ధ్య జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. ఒక్క ఛాన్స్ అన్నారు. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. మ‌రి ఆ త‌ర్వాత ఐదేళ్ల పాల‌న చూశాకే క‌దా.. 11 స్థానాల‌కు ప‌రిమితం చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చేప‌ట్టే పాద‌యాత్ర‌పై పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయ‌తే.. గతంలో ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ ప్రజలకు దగ్గరై అధికారంలోకి వచ్చారనే నమ్మకం పార్టీ క్యాడర్‌లో ఉంది. అదే ఇప్పుడు కూడా త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు వేసుకుంటోంది.

ప్రతికూలాలు...

వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త‌ పాలనకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు వ్యత్యాసం ఉంంది. కేవలం పాదయాత్రతోనే ప్రజల మైండ్‌సెట్ మారుతుందా అనేది చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. 2027లో యాత్ర ప్రారంభించి 2029 నాటికి ప్రజల్లో నిరంతరం ఉండాలనే వ్యూహం ఉన్నప్పటికీ, అప్పటి వరకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను ఏ స్థాయిలో నిలకడగా కొనసాగిస్తారనేది కీలకం. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన సంక్షేమంతోపాటు.. అభివృద్ధి, ఉపాధిక‌ల్ప‌న‌, ఉద్యోగాలు వంటివాటికి కూట‌మి స‌ర్కారు ప్రాదాన్యం ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌న్నది.. పార్టీ పునర్వైభవాన్ని తెస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మ‌రోవైపు కూట‌మి ప‌క్షాలు రోజు రోజుకు మ‌రింత బ‌లోపేతం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.