Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ డైలాగ్ తో జగన్...2029 కోసమేనా ?

రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ. ఒకవేళ మొదట్లో లేకపోయినా రాజకీయాల్లో ప్రవేశించాక ఆటోమేటిక్ గా అవి కచ్చితంగా అలవాటు చేసుకుంటారు.

By:  Satya P   |   21 Oct 2026 9:11 AM IST
సెంటిమెంట్ డైలాగ్ తో జగన్...2029 కోసమేనా ?
X

రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ. ఒకవేళ మొదట్లో లేకపోయినా రాజకీయాల్లో ప్రవేశించాక ఆటోమేటిక్ గా అవి కచ్చితంగా అలవాటు చేసుకుంటారు. వారికి లభించే విజయాలు అనుకూల వాతావరణం బేరీజు వేసుకుని అదే రూట్లో వెళ్తారు. ఈ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అతీతులు కారనే అంటున్నారు. ఆయన పాదయాత్ర నుంచి తన డైలాగులు వరకూ అన్నీ సెంటిమెంట్ ని అనుసరించి ఎక్కడ ఏది వాడాలో వాడుతున్నారని అంటున్నారు. 2017లో పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో సక్సెస్ అయిన జగన్ 2027 లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం వెనక అంకెల సెంటిమెంట్ ఉంది అని అంటున్నారు. ఇక జగన్ కి 2019 కలసి వచ్చింది. 2029 కూడా కలసి వస్తుందని సెంటిమెంట్ ని వైసీపీ నేతలు వల్లె వేస్తున్నారు. దానికి కారణం రెండు చోట్లా 9వ నంబర్ ఉండడమే.

టీడీపీకి ఆ విధంగా :

ఇదిలా ఉంటే తెలుగుదేశానికి చివరిలో వచ్చే 9 నంబర్ యాంటీ సెంటిమెంట్ అని ఊహిస్తున్న వారూ ఉన్నారు. 1989లో జరిగిన ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలిసారి ఓటమి పాలు అయింది. అలాగే 1999లో అయితే బొటాబొటీతో ఉమ్మడి ఏపీలో గెలిచినా 2009, 2019లలో రెండు సార్లు ఓడింది. దాంతో 2029 లో టీడీపీ ఓటమి పాలు అవుతుందని వైసీపీ అంచనా వేసుకుంటోంది. అందుకే మేమే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక టీడీపీకి మరో యాంటీ సెంటిమెంట్ ఉంది. అదే ఒకసారి ఆ పార్టీ గెలిస్తే మరోసారి గెలిచేది ఉండదు, అలా గడచిన ఎన్నో ఎన్నికలు రుజువు చేశాయి. ఇపుడు కూడా 2024 లో గెలిచింది కాబట్టి 2029 లో ప్రతిపక్ష స్థానమే అని వైసీపీ బలంగా నమ్ముతోంది.

మీ టైమూ మా టైమూ :

ఇక తాజాగా చూస్తే జగన్ ఒక డైలాగ్ వాడుతున్నారు. ప్రస్తుతం మీ టైం నడుస్తోంది కానీయండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే కాలం ఎల్ల వేళలా ఒకేలా ఉండదని కూడా గట్టిగా చెబుతున్నారు. అపుడు మా టైం వస్తుందని మీరు విత్తిన విషపు విత్తనాలే ఆనాడు విష వృక్షాలుగా మారుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలా మీ టైం ఇది మాకూ టైం వస్తుందని జగన్ హెచ్చరించడం వెనక ఓల్డ్ సెంటిమెంట్ డైలాగ్ ఉంది అని గుర్తు చేస్తున్నారు. వెనక్కి వెళ్తే 2014 ఎన్నికల మీద ఎంతో ఆశలు పెట్టుకున్న వైసీపీకి అప్పట్లో చేదు అనుభవాలే మిగిలాయి. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున జగన్ మీడియాతో మాట్లాడుతూ టైం వారిది అందుకే ఒక దెబ్బ కొట్టారు, మేము తీసుకున్నాం, మాకూ టైం వస్తుంది ఇంతకు ఇంత గట్టిగా కొడతామని అన్నారు. ఆ తరువాత 2019 లో అదే నిజం అయింది. అందుకే జగన్ దానిని తిరిగి వాడుతున్నారని అంటున్నారు.

పార్టీకి బూస్టప్ గా :

వైసీపీ అయితే ఇపుడు కొంత ఇబ్బందులో ఉంది. నామినేషన్లు సైతం దాఖలు చేయలేని స్థితిలోకి చాలా చోట్ల వెళ్ళిపోయారు. దాంతో వారికి ధైర్యం చెప్పడమే కాకుండా మనవే ముందున్న రోజులు అంటూ వైసీపీ అధినాయకుడు ఈ విధంగా ఒక స్ట్రాంగ్ మేసేజ్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీలో అయితే 2029 ఎన్నికల మీద ధీమా ఉందని జగన్ నుంచి పార్టీ నేతలు అంతా సెంటిమెంట్ నే నమ్ముకుని ముందుకు సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి 2029 వైసీపీకి ఎలా ఫేవరేట్ చేస్తుందో.