గ్రౌండ్ లో వైసీపీని ఖాళీ చేయించే వ్యూహం ?
వైసీపీ అధినాయకత్వం స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఏకగ్రీవాలు వద్దే వద్దు అని అధినేత జగన్ ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.
By: Satya P | 2 Sept 2026 8:00 AM ISTవైసీపీ అధినాయకత్వం స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఏకగ్రీవాలు వద్దే వద్దు అని అధినేత జగన్ ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పోటీకి దిగాల్సిందే అంటున్నారు. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ వరకూ. మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ల దాకా నగరాల్లో అయితే వార్డు కార్పోరేటర్ నుంచి మేయర్ దాకా పోటీ పడాల్సిందే అని వైసీపీ హైకమాండ్ కచ్చితంగా చెబుతోంది. వైసీపీ పెద్దలు ఈ విధంగా చెప్పడానికి వారి ఆలోచనలు వారికి ఉన్నాయి. గెలుపు సంగతి పక్కన పెడితే క్యాడర్ మొత్తం యాక్టివ్ అవుతుంది. అలాగే నాయకులు కార్యకర్తల మధ్యన కనెక్షన్ పెరిగితే అది పార్టీకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. అంతే కారు వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో ఒక్కసారిగా రీఛార్జ్ అయితే ఆ హీట్ ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ 2029 ఎన్నికలలో గెలుపు వ్యూహాలను రచించుకోవచ్చు అన్నది వైసీపీ మార్క్ ప్లాన్ గా ఉంది.
నిస్తేజంలో క్యాడర్ :
అయితే ఇదంతా హైకమాండ్ స్థాయిలో పై లెవెల్ లో ఆలోచనలుగా ఉంటే గ్రౌండ్ లెవెల్ లో చూస్తే క్యాడర్ లో నిలువునా నిస్తేజం ఆవహించి ఉంది. పార్టీ పరంగా ఈ రెండేళ్ళుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టినా క్యాడర్ ని దగ్గరకు తీసుకునేది అయితే లేదు, నియోజకవర్గ ఇంచార్జిలకు చాలా మందికి క్యాడర్ తో డైరెక్ట్ రిలేషన్స్ లేవని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలుగా వెలిగిన నాడు తమ అనుచరులకు అనునయులకు మేలు చేసుకుంటూ తమను పక్కన పెట్టారు అన్న ఆక్రోశం క్యాడర్ లో అలాగే ఉంది. అందుకే నాయకులు కూడా వారితో అదే దూరం పాటిస్తున్నారు. ఇపుడు హైకమాండ్ పిలుపు మేరకు తమ క్యాడర్ ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్న వెతుకులాటలో నియోజకవర్గం పెద్దలు పడ్డారని అంటున్నారు. అయితే నిరాశ నిస్తేజంతో క్యాడర్ ఉందని అంటున్నారు.
కూటమి చాణక్య వ్యూహం :
ఒక వైపు వైసీపీ ఏకగ్రీవాలు వద్దు పోటీ చేసి తీరాలి అంటూంటే బలమైన నేతల కోసం వైసీపీ అన్వేషణలో ఉంది. అంగబలం అర్ధబలం కలిగిన నేతలను గుర్తించి పోటీకి దించాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు కూటమి పార్టీల చాణక్య వ్యూహం చెక్ పెడుతోంది అని అంటున్నారు. మండలాలు గ్రామాలలో పట్టణాలలో నగరాలలో బలంగా ఉన్న వైసీపీ నేతలను గుర్తు పట్టే పనిలో కూటమి పార్టీలు ముందు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు వారిలో అసంతృప్తి నేతలను గుర్తించి తమ వైపు తిప్పుకునే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీశారని అంటున్నారు. అసలే వైసీపీలో రెండేళ్ళుగా ఓటమితో నిరాశ చెందుతూ ఎవరూ పట్టించుకునే వారు లేక భవిష్యత్తు మీద తగిన భరోసా కానరాక సతమతమవుతున్న ద్వితీయ శ్రేణి నేతలను లాగేసేందుకు కూటమి భారీ స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు.
ఆదికి ముందే అవుట్ అంటూ :
దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలు కాకుండా గ్రౌండ్ లెవెల్ లో వైసీపీని ఖాళీ చేయించే కార్యక్రమానికి కూటమి భారీ యాక్షన్ ప్లాన్ తో శ్రీకారం చుట్టింది అని అంటున్నారు. దాంతో మండలాలు గ్రామాలు బలమైన వైసీపీ నేతలతో కూటమి పార్టీలు టచ్ లోకి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అదే కనుక జరిగితే యుద్ధం ప్రారంభం కాక ముందే వైసీపీకి భారీ షాక్ ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. వైసీపీలో బలంగా ఉన్న నాయకులతో గత రెండేళ్ళుగా పార్టీ సమావేశాలు జరిపి వారిలో కొత్త ఉత్సాహాన్ని కలిగించి ఉంటే ఈ రోజున అసంతృప్తి ఉండేది కాదని అంటున్నారు. ఇదిలా ఉంటే అసంతృప్తితో కొందరు పార్టీని వీడాలని అనుకుంటే మరి కొందరు వైసీపీ తరఫున పోటీ చేసినా గెలుపు గ్యారంటీ ఉంటుందా అని ఆలోచిస్తూ కూటమి వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ తెగించి పోటీకి దిగినా వేధింపులు అధికార పార్టీ నుంచి మరో మూడేళ్ళ పాటు ఉంటాయని వాటిని భరించడం కష్టం అనుకున్న వారు కూడా ఫ్యా నీడన ఉండడం కష్టమనుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి కూటమి ఆపరేషన్ ఆకర్ష్ తో దూకుడు చేస్తూంటే తమ క్యాడర్ ని కాపాడుకోవడానికి వైసీపీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అన్నదే ఇపుడు కీలక చర్చగా ఉంది.
