అంబటి కుమార్తెకు జగన్ చాన్స్ ?
దీని వల్ల పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించినట్లు అవుతుందని అలాగే సీనియర్లు కూడా పార్టీకి మరో రూపంలో సేవ చేసేందుకు ఆస్కారం ఉంటుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది.
By: Satya P | 10 Oct 2026 12:00 AM ISTవైసీపీలో జగన్ కొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయంలో ఆయన మిగిలిన పార్టీల మాదిరిగా కాకుండా వేరే పంధా అనుసరిస్తున్నారు. తమ పార్టీలో సీనియర్ నేతలను పక్కన పెట్టకుండానే వారి కుటుంబంలో ప్రతిభ కలిగిన వారు ఉంటే చాన్స్ ఇచ్చి ఆ విధంగా సీనియర్ల సేవలను అనుభవంగా వాడుకోవాలని చూస్తున్నారు. దీని వల్ల పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించినట్లు అవుతుందని అలాగే సీనియర్లు కూడా పార్టీకి మరో రూపంలో సేవ చేసేందుకు ఆస్కారం ఉంటుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది.
యూత్ ఫుల్ గానే :
వైసీపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ నుంచి ఈ వైపుగా వచ్చిన నేతలతో నిండిన ఓల్డ్ పార్టీగా విమర్శలు ఉన్నాయి. ఒక వైపు టీడీపీలో చూస్తే కొత్త పోకడలతో తన పార్టీ స్వరూపాన్ని మార్చుకుంటోంది. జనసేనకు యూత్ ఆలంబనగా ఉన్నారు. వైసీపీ తీరు మాత్రం అలాగే ఉంది. అక్కడ పనిచేసే సగటు నాయకుడి ఏజ్ అరవైలు దాటేసి ఉంది. దాంతో వైసీపీ కూడా ఇపుడిపుడే కొత్త డిజైన్ లోకి వెళ్లాలని చూస్తోంది. యూత్ తోనే ఫ్యూచర్ అన్న థియరీతో ముందుకు సాగాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఉన్న ఉదుటన కొత్త రక్తాన్ని ఎక్కించడం అంటే కష్టం కాబట్టి ప్రాధమికంగా చేయాల్సిన చర్యలను తీసుకుంటోంది.
వారసులకు అందలం :
వారసులకు వైసీపీ ఎక్కువగా గుర్తింపు ఇవ్వాలని భావిస్తోంది. అలాగని అందరూ కాదని కూడా చెప్పకనే చెబుతోంది. జనంలోకి చొచ్చుకుని పోయి పార్టీ ఫిలాసఫీని వివరిస్తూ తాముగా నిలిచి గెలిచే సత్తా ఉన్న వారిని గుర్తించి వారికి అందలం అందించాలని అనుకుంటోంది. మీడియా ముందు జనంతోనూ పార్టీ జనంతోనూ మమేకం అయి కలసి పోయే వారికే ప్రాధ్నాన్యత ఇస్తోంది. అలాగే తమకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వారికి అయితే ఫ్యాన్ పార్టీలో అవకాశాలు ఉంటాయని చెబుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ యువతకు మహిళలకు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతోంది.
మేయర్ సీటుకు ఆమె :
ఇదిలా ఉంటే మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన అంబటి రాంబాబు కుమార్తె మౌనికను గుంటూర్ మేయర్ బరిలోకి దించాలని జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంబటి రాంబాబు ఆ మధ్యన జైలు పాలు అయితే మీడియా ముందుకు వచ్చి మౌనిక డేరింగ్ గా మాట్లాడిన తీరుతో అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. ఆమె మాటలలో స్పష్టత కాన్ఫిడెన్స్ ఇవన్నీ వైసీపీ అధినాయకత్వం గమనిస్తూ వచ్చింది. ఇపుడు సరైన సమయం కాబట్టి ఆమెను ప్రోజెక్ట్ చేయాలని చూస్తోంది. గుంటూర్ నగర పరిధిలో కాపులు అధికంగా ఉన్నారు. దాంతో పాటు మహిళల ఓట్లని కూడా టార్గెట్ చేస్తూ మౌనికను అభ్యర్ధిగా బరిలో ఉంచితే వైసీపీకి అది అడ్వాంటేజ్ అవుతుందని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. త్వరలోనే దీని మీద కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
నెల్లూరు పగ్గాలు :
అలాగే మరో మహిళా నేత కాకాణి పూజితకు నెల్లూరు జిల్లా వైసీపీ పగ్గాలు అందించాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తండ్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో పూజిత మీడియా ముందు మాట్లాడుతూ కూటమిని గట్టిగానే విమర్శించారు. ఆ తరువాత ఆమె ప్రజా సమస్యల మీద స్పందిస్తున్న తీరుని మహిళా నాయకురాలిగా ఆమె వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో ప్రమోషన్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు.
బొత్స వారసురాలుతో :
ఇక ఉత్తరాంధ్రాలో చూస్తే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వారసురాలిగా కుమార్తెని భీమిలీ వైసీపీ ఇంచార్జిగా నియమించారు. ఆమె 2029 ఎన్నికల్లో భీమిలీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇదే తీరున మరింతమంది మహిళా నాయకురాళ్ళకు స్థానిక ఎన్నికల్లో ప్రోత్సాహం ఇచ్చి తరువాత సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దించాలని చూస్తున్నారు. అలాగే యువ నేతలుగా సీనియర్ల వారసులలో గట్టి వారిని ఎంపిక చేసి 2029 ఎన్నికల్లో బరిలోకి దించాలని కూడా వైసీపీ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
