Begin typing your search above and press return to search.

పోలీస్ ఆంక్షలు అలా...మందీ మార్బలంతో జగన్ !

జగన్ నెల్లూరు టూర్ మొత్తం టెన్షన్ టెన్షన్ గానే సాగింది. జగన్ కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున క్యాడర్ వచ్చింది.

By:  Satya P   |   31 July 2025 1:34 PM IST
పోలీస్ ఆంక్షలు అలా...మందీ మార్బలంతో జగన్ !
X

నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు తగిన భద్రతను కల్పించాలంటే తక్కువ మందితోనే ఆయన టూర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. జగన్ హెలిపాడ్ వద్దకు పది మంది ములాఖత్ వద్ద ముగ్గురు మాత్రమే రావాలని పోలీసులు ఆంక్షలు పెట్టారు. జనసమీకరణ చేయమని వైసీపీ నేతల చేత లిఖితపూర్వకంగా తీసుకున్నారు. ఇంత చేసినా జగన్ నెల్లూరు పర్యటన మాత్రం జనాలతోనే సాగిపోయింది. మందీ మార్బలంతో జగన్ వచ్చి మరీ నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని పరామర్శించారు.

టెన్షన్ టెన్షన్ గా :

జగన్ నెల్లూరు టూర్ మొత్తం టెన్షన్ టెన్షన్ గానే సాగింది. జగన్ కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున క్యాడర్ వచ్చింది. ఎక్కువగా జనాలు వద్దు అని పోలీసులు ఒక వైపు చెప్పినా వైసీపీ నేతలు వాటిని బాహాటంగానే ఉల్లంఘిచిన పరిస్థితి అయితే కనిపించింది. మరో వైపు చూస్తే పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్య జనాలు కూడా రోడ్ల మీదకు గుమిగూడారు. సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు ప్రకటించినా కూడా జనాలు రావడంతో లాఠీచార్జి కొన్ని చోట్ల చేయాల్సి వచ్చింది.

క్యాడర్ మీద లాఠీ దెబ్బ :

వైసీపీ క్యాడర్ మీద పోలీసు లాఠీ దెబ్బ పడింది. వద్దు అన్నా వినకుండా వచ్చారని పోలీసులు లాఠీ చార్జి చేశారు. అయితే తమ పార్టీ వారి మీదనే లాఠీ తీస్తారా అని వైసీపీ నేతలు ఒక వైపు పోలీసులతో గొడవకు దిగారు. దాంతో పోలీసులు వర్సెస్ వైసీపీగా వ్యవహారం మారింది. జగన్ తన ఇంటికి వస్తున్నారు అని తెలిసి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బయటకు వస్తే ఆయన వెంట కూడా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే రోడ్ల మీద ఉండేందుకు ఎవరికీ అనుమతి లేదంటూ పోలీసులు లాఠీలు తేయడంతో నల్లపురెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరో వైపు నల్లపురెడ్డిని పోలీసులు తోసయడంతో నన్నే తోస్తారా అని ఆయన ఉగ్రరూపం ప్రదర్శించడంతో వ్యవహారం వేరేగా మారిపోయింది.

హోరెత్తిన నినాదాలు :

జగనన్నకు జై అన్న నినాదాలకు బదులుగా పోలీసు జులుం నశించాలి అన్న నినాదాలను వైసీపీ క్యాడర్ అందుకున్నారు. తమను కొడుతున్నారని తమ నాయకుడిని చూడనీయడం లేదు అంటూ వారు ఫైర్ అవుతూ రోడ్ల మీదకు రావడంతో అంతా ఉదిర్కతంగా మారింది. మొత్తానికి జగన్ నెల్లూరు టూర్ అయితే క్యాడర్ వర్సెస్ పోలీస్ మారింది. తాను పెట్టిన ఆంక్షలను ధిక్కరించారు అన్న ఆగ్రహంతో పోలీసులు ఉంటే తమ నాయకుడిని కలిసేందుకు తమకు ఆంక్షలు ఎందుకు అని క్యాడర్ ప్రశ్నిస్తోంది.