Begin typing your search above and press return to search.

‘ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు’... నెల్లూరులో జగన్ నిప్పులు!

ఇదే సమయంలో... తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని చెప్పిన జగన్... వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటం కోసం ఉన్నారని మండిపడ్డారు.

By:  Raja Ch   |   31 July 2025 5:29 PM IST
‘ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు’...  నెల్లూరులో జగన్  నిప్పులు!
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నెల్లూరు టూర్ ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ పర్యటన సందర్భంగా... హెలిప్యాడ్‌ వద్ద వైఎస్‌ జగన్‌ కు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో.. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని.. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు.

అవును... నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు తగిన భద్రతను కల్పించాలంటే తక్కువ మందితోనే ఆయన టూర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఇందులో భాగంగా... హెలిపాడ్ వద్దకు పది మంది, ములాఖత్ వద్ద ముగ్గురు మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టారు! కట్ చేస్తే... మిగిలిన చోట్ల వేల మంది రోడ్లపైకి వచ్చారు. అనంతరం మాట్లాడిన జగన్... సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. ఎమర్జెన్సీ!:

ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్... ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని.. ఫలితంగా నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని జగన్ అన్నారు. తాను తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని ప్రశ్నించిన ఆయన... తన పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు. మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయని విమర్శించారు.

"నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం":

ఇదే సమయంలో... తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని చెప్పిన జగన్... వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటం కోసం ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారని.. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను వెన్నుపోటు పొడిచారని.. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని విమర్శించారు.

మనిషి నచ్చకపోతే చంపేస్తారా..?:

ఈ సందర్భంగా... ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారని.. 80 మందిని పంపి దాడి చేయించారని.. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారని.. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారని జగన్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది కానీ.. ఆయన ఉండి ఉంటే చంపేసేవారేమో అని అన్నారు. మనిషి నచ్చకపోతే చంపేస్తారా? అని ప్రశ్నించారు.

శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయింది!:

మరోవైపు... కాకాణి గోవర్ధన్‌ పై 14 కేసులు పెట్టారని.. కావలిలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని.. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారని జగన్ మండిపడ్డారు. అసలు ఒక రాజకీయ నాయకుడు ప్రెస్‌ మీట్‌ పెడితే.. దానిని వాట్సాప్‌ లో షేర్‌ చేస్తే కేసులు పెడతారా..? ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు..? అని ప్రశ్నించిన జగన్.. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు.

లిక్కర్‌ మాఫియాకు డాన్‌ చంద్రబాబే!:

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్ లలో మద్యం అమ్ముతున్నారని.. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు మద్యం అమ్ముతున్నారని జగన్ మండిపడ్డారు.

ఇదే సమయంలో... మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారని.. మైన్స్‌ కమీషన్లు చంద్రబాబు, లోకేష్‌ కే చేరుతున్నాయని.. పరిశ్రమలు నడుపుకోవాలన్నా, ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలని జగన్ విమర్శించారు.

కాలేజ్ రోజులను గుర్తుపెట్టుకుని పగ తీర్చుకుంటున్నారు!:

కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కొట్టారని.. చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని.. అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని తెలిపారు. ఇదే సమయంలో... తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే ఆయనపైనా చంద్రబాబు కేసు పెట్టించాడని అన్నారు.

మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే!:

ఈ సందర్భంగా... ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు చంద్రబాబు అని మొదలుపెట్టిన జగన్... కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుందని.. అప్పుడు మా ప్రభుత్వమే వస్తోందని అన్నారు. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, ఆయన అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతామని.. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదని జగన్ హెచ్చరించారు.

చాలామంది అధికారులు అప్పటికి రిటైరైపోతామ్.. వీఆరెస్స్ తీసుకుంటామ్.. విదేశాలకు పారిపోతామ్ అని అనుకోవచ్చు కానీ.. సప్త సముద్రాల అవతల ఉన్నా.. వారు చేసిన పనులను చట్టం ముందు పెడతామని జగన్ స్పష్టం చేశారు. వారందరికీ శిక్ష పడేలా చేస్తామని పునరుద్ఘాటించారు.