Begin typing your search above and press return to search.

జగన్ గెలిచారు....షర్మిల సిసలైన ప్రత్యర్ధి ?

రాజకీయాల్లో రంగు రుచి వాసనలు ఉండవు అంటారు. రక్త బంధాలకు తావు అంతకంటే ఉండదని చెబుతారు.

By:  Satya P   |   29 July 2025 4:50 PM IST
జగన్ గెలిచారు....షర్మిల సిసలైన ప్రత్యర్ధి ?
X

రాజకీయాల్లో రంగు రుచి వాసనలు ఉండవు అంటారు. రక్త బంధాలకు తావు అంతకంటే ఉండదని చెబుతారు. అది అనాదిగా జరుగుతూనే ఉంది. అయితే ఎపుడూ కొత్త వింతగానే ఉంటుంది. వైసీపీ విషయానికి వస్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ రాజకీయంగా విడిపోయారు. అవి కుటుంబ బంధాల మీద ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో ఒక కీలక తీర్పు వెలువడింది.

తీర్పు ఆయన వైపు :

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్ సి ఎల్ టీ తీర్పు వెలువరించింది. ఈ కేసులో జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ని విచారణకు అనుమతించింది తన కంపెనీలో షేర్లను అక్రమంగా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల బదిలీ చేసుకున్నారు అని జగన్ గత ఏడాది ఎన్ సి ఎల్ టీలో పిటిషన్ దాఖలు చేశారు. బదిలీ అయిన షేర్లను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. తాజా తీర్పుతో జగ్న కి బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయింది.

సంచలనం రేపిన కేసు :

నిజానికి గత ఏడాది ఈ కేసు బాహాటం అయింది. తన కంపెనీలో షేర్లను అక్రమంగా బదిలీ చేయించుకున్నారు అని జగన్ ఆరోపిస్తూ ఎన్ సీ ఎల్ టీకి వెళ్ళారు. ఆయన పిటిషన్ దాఖలు చేసినపుడు పెద్ద ఎత్తున కుటుంబం వైపు నుంచి షర్మిల విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీలు కూడా తల్లిని చెల్లెలుని జగన్ ఇబ్బంది పెడుతున్నారు అని కూడా విమర్శించారు. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రులు కొందరు మీడియా ముందుకు వచ్చి ఇదీ విషయం అని చెప్పారు. అలా కుటుంబ వివాదం రాజకీయంగా మారి మరింతగా సంచలనం అయింది.

వ్యతిరేక పంధా వల్లనే :

ఇక తన చెల్లెలు మీద ఒకనాడు ప్రేమాభిమానాల్తో షేర్లు ఇవ్వడం వాస్తవం అని అయితే ఈడీ సీబీఐ కేసులు సెటిల్ అయిన తరువాతన వాటిని బదిలీ చేస్తాను అని ఒప్పందం ఉందని జగన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు సందర్భంగా పేర్కొన్నారు అని చెబుతారు. అయితే ఆస్తులలో వాటాలు ఇవ్వకుండా జగన్ చెల్లెలుని మోసం చేశారు అని విపక్షాలు విమర్శించాయి. అయితే పది నెలల పాటు సాగిన ఈ కేసులో తీర్పు తరువాత ట్రైబ్యునల్ అయితే జగన్ వాదనతో ఏకీభవించినట్లుగా కనిపిస్తోంది. షేర్ల బదిలీని నిలుపు చేయడం ద్వారా జగన్ కి భారీ ఉపశమనం కలిగింది.

ఇక మరింత డైరెక్ట్ గా :

జగన్ విషయంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఆమె తాజాగా లిక్కర్ స్కాం విషయంలో జగన్ అరెస్టు మీద సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇప్పటికే ఉప్పూ నిప్పులా ఉన్న బంధాలు మరింతగా మండుతాయా అన్న చర్చ సాగుతోంది. రానున్న రోజులలో షర్మిల మరింత దూకుడుగా జగన్ కి ఎదురు నిలిచి సిసలైన రాజకీయ ప్రత్యర్ధిగా మారుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఈ తీర్పు అయితే ఆసక్తికరంగా ఉంది. అలాగే చర్చకు తావిచ్చేలా ఉంది అని అంటున్నారు.