జగన్ బాటలో నవీన్ పట్నాయక్...న్యూట్రల్ స్టాండ్ మారుతోందా ?
ఏపీలో జగన్ ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఇపుడు ఒకే బాటలో పయనిస్తున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది.
By: Satya P | 21 Oct 2026 11:00 PM ISTఏపీలో జగన్ ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఇపుడు ఒకే బాటలో పయనిస్తున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. నిజానికి ఈ ఇద్దరి మధ్య పోలికలు కొన్ని ఉన్నాయి కానీ ఇద్దరి అనుభవం, రాజకీయ నేపథ్యం, వ్యూహాలు వేరుగా ఉన్నాయి. ఇద్దరూ తమ తండ్రుల వారసులుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక నవీన్ 23 ఏళ్ల పాటు నిరాటంకంగా ఒడిషాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్ అయిదేళ్ళు మాత్రమే సీఎం గా ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఢిల్లీ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరని పేరుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా వారితో సర్దుకుపోతూ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు. జగన్ కూడా 2019 నుంచి 2024 వరకూ కేంద్రంలోని బీజేపీతో సయోధ్యను నెరిపారు. ఇక ఈ ఇద్దరూ కూడా అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీయేలో కానీ చేరకుండా న్యూట్రల్ స్టాండ్ ని అనుసరిస్తూ వస్తున్నారు.
బీజేపీకి దూరంగా :
కీలకమైన బిల్లుల విషయంలో జగన్ నవీన్ పట్నాయక్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరి మద్దతు మీద బీజేపీ రెండవ ఆలోచన చేయలేనంతగా వీరి సహకారం ఉంటూ వచ్చింది. అలాంటిది జగన్ మాదిరిగానే నవీన్ పట్నాయక్ కూడా ఇపుడు బీజేపీకి దూరం కావాలని చూస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. దానికి కారణం ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిషేధిత ప్రాంతంలో జాతీయ జెండాను ఎగురవేసినందుకు గానూ, జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు మద్దతుగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ట్వీట్ తో హీట్ :
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల నిర్బంధాన్ని తక్షణమే పునః సమీక్షించి వారిని వెంటనే విడుదల చేయాలని నవీన్ పట్నాయక్ తన ట్వీట్ లో డిమాండ్ చేశారు. నిషేధిత ప్రాంతంలోనైనా సరే దేశ జాతీయ జెండాను ఎగరవేసినందుకు గానూ ఇంత సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం సరైనది కాదని నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.ఈ దేశ యువత చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగ హక్కులపై నమ్మకం కోల్పోకుండా ఉండేలా న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇక ఈ ట్వీట్‌పై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ నవీన్ పట్నాయక్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరో వైపు చూస్తే దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు మద్దతు ఇస్తున్నారంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ వంటి అధికార పక్ష నేతలు పట్నాయక్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇండీ కూటమి వైపుగా :
ఇక జగన్ అయితే సీజేపీకి మద్దతుగా ట్వీట్ చేసి తన వైఖరి చెప్పారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాల విషయంలో బీజేపీ బిల్లులకు మద్దతు ఇవ్వడం ద్వారా తప్పు చేశామని బాధ వ్యక్తం చేశారు. ఇలా నెమ్మదిగా ఆయన తన రాజకీయ ఆలోచనలను బయటపెడుతున్నారు అని చర్చ సాగుతోంది. ఇపుడు నవీన్ కూడా ట్వీట్ తో మొదలెట్టారు. ఆయన సీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా వారంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీకి కన్నెర్ర అవుతున్నారు. అయితే ఆయన కూడా 2024 ఎన్నికల్లో తన పార్టీ ఓటమి పట్ల ఈ రోజుకీ జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ప్రజలలో విశేషమైన ఆదరణ ఉండి తాను ఓటమి పాలు కావడమేంటి అన్నది ఆయనతో పాటు బీజేడీలో కూడా ఉంది అని అంటున్నారు. ఒడిషాలో బీజేపీ అధికారంలో ఉంది. దాంతో అక్కడ నుంచి ఢిల్లీ వైపుగా ఆయన రాజకీయ పోరాటం పెంచుతారు అని అంటున్నారు. మరి ఏపీ ఒడిషా నాయకులు ఇద్దరూ ఏమి చేయబోతారు అన్నది వేచి చూడాల్సిందే.
