Begin typing your search above and press return to search.

అయ్యన్న వారసుడు వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టేశారుగా !

అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి జగన్ వస్తున్నారు అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

By:  Satya P   |   11 Oct 2025 10:08 PM IST
అయ్యన్న వారసుడు వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టేశారుగా !
X

అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి జగన్ వస్తున్నారు అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ సీఎం వైసీపీ అధినేత అయిన జగన్ రోడ్ షోతో వస్తున్నారు అంటే ఇంకా హీటెత్తిపోయింది. ఒక వైపు అయ్యన్న ఇలాకాలో జగన్ అంటూ పొలిటికల్ గా బిగ్ డిబేట్ సాగుతోంది. దాంతో ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి కూడా దానితో పాటే మొదలైంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఏ విధంగా ఈ విషయంలో కౌంటర్ యాక్షన్ చూపిస్తుంది అన్నది కూడా ఉత్కంఠను కలిగించేదిగా మారింది.

అయ్యన్న లేని వేళలో :

తమాషా ఏమిటి అంటే జగన్ కి దమ్ముంటే జీవో కాపీ చూపించాలని కొద్ది రోజుల క్రితం సవాల్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీరా జగన్ నర్శీపట్నం వచ్చే సమయానికి ఇదేశాలలో ఉన్నారు ఆయన బార్బడోస్‌లో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళారు. దాంతో వైసీపీకి ఏకపక్షమైన రాజకీయం అవుతుందా అన్నదే అంతా అనుకున్న నేపథ్యం ఉంది. అయితే అయ్యన్న కుమారుడు ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన విజయ్ మాత్రం జగన్ తమ సొంత ఇలాకాలో అడుగుపెడుతున్న వేళ తనదైన రాజకీయ మంత్రాంగం నడిపి వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లో పడేశారు.

షాకింగ్ ఫ్లెక్సీలతో :

జగన్ నర్శీపట్నం వస్తారు అనగానే ముందు రోజే డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలతో నర్సీపట్నంలో టీడీపీ హోరెత్తించింది. కరోనా టైం లో మాస్కులు అడిగిన పాపానికి దళిత డాక్టర్ ని నానా ఇబ్బందులు పెట్టి ఆఖరికి ఆయన మరణానికి కారకులు అయ్యారంటూ జగన్ మీద విమర్శలు చేస్తూ వెలసిన ఆ ఫ్లెక్సీలు నర్శీపట్నంతో పాటు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. మాస్కులే ఇవ్వలేని వారు మెడికల్ కాలేజీలు కడతారా అంటూ వేసిన సెటైర్లు కూడా సోషల్ మీడియా ద్వారా బిగ్ డిబేట్ కి దారి తీశాయి. ఈ రకమైన ప్లాన్ వెనక విజయ్ ఉన్నారని అంటున్నారు. అంతే కాదు దళితులు అంతా గో బ్యాక్ జగన్ అంటూ నర్శీపట్నం లో ఆందోళనలు చేయడం అలాగే సోషల్ మీడియా ద్వారా వైసీపీ నర్శీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఎంత సొమ్ము వెచ్చింది అసలు ఏమి జరిగింది అన్న వాస్తవాలను కూడా పూర్తి వివరాలతో జనం ముందు పెట్టడంలోనూ విజయ్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.

రుజువు చేసుకున్నారుగా :

అయ్యన్నపాత్రుడు అయితే మీడియా ముందుకు వచ్చి వైసీపీ అధినాయకత్వానికి జవాబు చెప్పేవారు అని విజయ్ మరి కాస్తా ముందుకు అడుగులు వేసి ఏకంగా వైసీపీనే డిఫెన్స్ లో పడేశారు అని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. జగన్ నర్శీపట్నం టూర్ జనాలతో సక్సెస్ అయింది అని ఆ పార్టీ చెప్పుకుంటున్నా అందులో కంటెంట్ మిస్ అయింది అని టీడీపీ చెబుతోంది ఆ విధంగా చేయడం వెనక విజయ్ వ్యూహాలే గట్టిగా పనిచేసాయని అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ తన రాజకీయ పరిణతిని సమయస్పూర్తిని చాటుకున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన విజయ్ 2029 నాటికి ఏకంగా తండ్రి సీటు నర్శీపట్నం నుంచే పోటీ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ దూకుడుని ఆయన సింగిల్ హ్యాండ్ తోనే అడ్డుకున్నారని పసుపు పార్టీ తమ్ముళు నిబ్బరంగా అంటున్నారు.