150 నియోజకవర్గాల్లో పాదయాత్ర.. జగన్ సంచలన ప్రకటన
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు.
By: Tupaki Political Desk | 28 Jan 2026 7:42 PM ISTఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పాదయాత్ర చేస్తానని, ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉంటానని జగన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ప్రతి కార్యకర్తను కలుస్తానని ప్రకటించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన పాదయాత్ర, జగన్ 2.0పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్.. గ్రామ స్థాయిలో కమిటీల నిర్మాణం చేపడతామని తెలిపారు. గతంలో తాను పాలనపై ఎక్కువ దృష్టి పెట్టానని, కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మంచి జరుగుతుందని తెలిపారు. కాగా, మాజీ సీఎం జగన్ ప్రకటన వైసీపీతోపాటు అధికార కూటమిలో తీవ్ర చర్చకు కారణమవుతోంది.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలంటే పాదయాత్రే శరణ్యమని మాజీ సీఎం జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ రెడ్డి 151 సీట్లు గెలుచుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. గత ఎన్నికల్లో ఈ ఫలితాలు తిరగబడటంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనవుతున్నాయి. డీలా పడిన కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకురావడానికి తాను క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ఒక్కటే మార్గంగా జగన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ కారణంగానే పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.
జగన్ పాదయాత్రపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తోంది. ప్రభుత్వం ఇంకా 40 నెలలు కొనసాగే అవకాశం ఉంది. చివరి ఏడాదిన్నర పాదయాత్ర చేస్తానని ఇంతకుముందు మాజీ సీఎం జగన్ ప్రకటించారు. అంటే దాదాపు 18 నెలలు ఈ పాదయాత్ర కొనసాగుతుందని అంటున్నారు. ఇంతవరకు ఈ సమయం ఒకటే ప్రచారంలో ఉండగా, ఇప్పుడు 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని జగన్ చెప్పడంతో కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోందని చెబుతున్నారు.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా, జగన్ రెడ్డి 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెబుతున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ ముగుస్తుంది అన్న వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే దీనిపై జగన్ రాజకీయ సలహాదారులు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం వరకు జగన్ పాదయాత్ర ఉంటుందని అంటున్నారు. ఈ రూట్ మ్యాప్ లో మొత్తం 175 నియోజకవర్గాలను చేర్చాలని తొలుత భావించినా కుదరడం లేదని చెబుతున్నారు. అయితే ఎన్నికల్లోగా ప్రతి నియోజకవర్గంలో జగన్ పర్యటించేలా కార్యక్రమం రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
