Begin typing your search above and press return to search.

ప్రతీ చోటా జగనన్న సైన్యం...పక్కా వ్యూహం !

వైసీపీ అధినేత గత ఇరవై నెలలుగా తాను తెర వెనకన ఉంటున్నారు. పార్టీని ముందు పెడుతున్నారు. ప్రతీ ఆందోళనను పార్టీ నాయకులు చేసేలా చూస్తున్నారు.

By:  Satya P   |   24 Jan 2026 4:00 PM IST
ప్రతీ చోటా జగనన్న సైన్యం...పక్కా వ్యూహం !
X

వైసీపీ అధినేత గత ఇరవై నెలలుగా తాను తెర వెనకన ఉంటున్నారు. పార్టీని ముందు పెడుతున్నారు. ప్రతీ ఆందోళనను పార్టీ నాయకులు చేసేలా చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఈ మధ్యన చేసిన ఆందోళన చాలా వరకూ సక్సెస్ అయింది. కోటి సంతకాల పేరుతో పార్టీలో కొంత చైతన్యం వచ్చింది. అయితే 2024లో ఓటమి తరువాత నుంచి జగన్ చేస్తున్నది చెబుతున్నదీ ఒక్కటే. పార్టీని పటిష్టంగా ఉంచాలని. పార్టీ బాగుంటేనే అంతా బాగుంటారు అని. అందుకే ఆయన కమిటీల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేశారు.

బూత్ లెవెల్ నుంచి :

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేయమని జగన్ ఆయా నియోజకవర్గం ఇంచార్జిలను కోరుతూ వస్తున్నారు. ఈ కమిటీలు కూడా కేవలం మొత్తం అనుబంధ సంఘాలతో కలిపి వేయమంటున్నారు. అంటే మహిళ, యువత, విద్యార్ధి, కార్మిక, రైతు విభాగాలు అన్న మాట. ఇలా అధ్యక్షుడు ఒకరు, ఉపాధ్యక్షులు ఇద్దరు, ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలు ఇద్దరు, కోశాధికారి ఈ విధానంలో కమిటీలు వేసుకుంటూ వెళ్తే బూత్ లెవెల్ లోనే కనీసంగా ఒక యాభై మంది దాకా క్యాడర్ కి పదవులు దక్కుతాయి, వారంతా అక్కడ పార్టీ సైన్యంగా ఉంటారు అని లెక్క వేస్తున్నారు. అక్కడ నుంచి వార్డు, అలాగే పంచాయతీ స్థాయి, మండలాలు, నియోజకవర్గాల దాకా ఈ కమిటీలు ఉంటాయి. దీంతో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసంగా 15 వేలకు తక్కువ కాకుండా జగనన్న సైన్యం తయారు అవుతుందని అంటున్నారు.

పదవ వంతుగా :

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు కనీసంగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది దాకా ఉంటారు. ఆ లెక్కన తీసుకుంటే అందులో పదవ వంతుగా వైసీపీ సైన్యం ఉంటారు అన్న మాట. ప్రతీ పది మంది ఓటర్లకు ఒక వైసీపీ కమిటీ మెంబర్ అన్నట్లుగా వైసీపీ అధినాయకత్వ ఈ రాజకీయ నిష్పత్తిని ఎంచుకుంది. వీరు కనీసంగా అయిదుగురిని పార్టీ వైపు మళ్ళించినా లేక పార్టీ పక్షాన ఉంచుకున్నా ప్రతీ నియోజకవర్గంలో ఎనభై వేల ఓట్లుగా మారుతాయని ఆ మీదట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో మరి కొంత యాడ్ అవుతుందని అధినాయకత్వం చేపట్టే పాదయాత్ర వంటి వాటితో ఇంకా ఆ నంబర్ పెరుగుతుందని మొత్తానికి నికరంగా ఒక లక్ష దాకా ఓట్లను ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంచుకోగలిగితే ఎన్నికల్లో ఎదురు ఉండదని వైసీపీ పక్కా ప్లాన్ తోనే కమిటీల మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు.

జగన్ విజన్ ఇదే :

తాజాగా విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జగన్ విజన్ ని ప్రతీ వారూ తెలుసుకోవాలని అన్నారు. పార్టీకి లాభం కలగాలని పార్టీ గెలవాలని ఆయన కమిటీలను ఏర్పాటు చేయమని గట్టిగా కోరుతున్నారని అన్నారు. జగన్ మాట వింటే పార్టీకి తిరుగు ఉండదని స్వామి చెప్పడం విశేషం. ప్రతీ నియోజకవర్గంలో జగనన్న సైన్యం పెద్ద ఎత్తున తయారు చేయమని అధినేత కోరుతున్నారని ఆయన అన్నారు. అంతా కష్టపడి కమిటీలను వేయాలని ఇక బూత్ లెవెల్ దాకా పార్టీని తీసుకుని వెళ్తే కనుక కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.

క్యాడరే లీడర్ :

మరో వైపు భీమిలీలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ ఇంచార్జి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కమిటీలు అన్నీ పూర్తి అయిన తరువాత క్యాడర్ ని తప్పకుండా గుర్తుంచుకుంటామని చెప్పారు. అంతే కాకుండా వారికే అన్ని విధాలుగా పెద్ద పీట వేస్తామని అంటున్నారు. ఇక కార్యకర్తలు అందరికీ ఐడెంటిటీ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన చెప్పారు. అధినాయకత్వం క్యాడర్ కే అగ్ర తాంబూలం అని చెబుతోందని అందువల్ల పార్టీ అధికారంలోకి వస్తే క్యాడరే లీడర్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు.