Begin typing your search above and press return to search.

స్టైలిష్ లుక్ లో జగన్.. ఫొటోలు ట్రెండింగ్

లండన్ టూర్ లో ఉన్న అన్నిరోజులు జగన్ రాజకీయాలకు దూరంగానే గడిపారు. రెండు వారాల సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించారు.

By:  Tupaki Political Desk   |   11 May 2026 2:22 PM IST
స్టైలిష్ లుక్ లో జగన్.. ఫొటోలు ట్రెండింగ్
X

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్టైలిష్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఎప్పుడు తెల్ల చొక్కా, ఖాకీ ఫ్యాంటుతో ఉండే జగన్ తాజాగా జీన్ ఫ్యాంటు, షర్ట్ తో డెనిమ్ లుక్ లో కనిపించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ కొత్తగా కనిపించే సరికి ఆయన ఫొటోలను అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో జగన్ కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

రెండు వారాల విదేశీ పర్యటన ముగించుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మాజీ సీఎం జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. లండన్ లో చదువుకుంటున్న కుమార్తెల వద్దకు జగన్ కుటుంబంతో సహా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన లేని కారణంగా గత పదిహేను రోజులుగా వైసీపీ కార్యకలాపాలు పెద్దగా సాగలేదని చెబుతున్నారు. ఎప్పుడు కళకళలాడే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం జగన్ లేని కారణంగా బోసిపోయినట్లు కనిపించింది.

లండన్ టూర్ లో ఉన్న అన్నిరోజులు జగన్ రాజకీయాలకు దూరంగానే గడిపారు. రెండు వారాల సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. ఆయన తిరిగి రావడంతో ఈ పదిహేను రోజులు చోటుచేసుకున్న పలు అంశాలపై స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా జగన్ రాష్ట్రంలో లేని సమయంలో కూటమి ప్రభుత్వం కీలకమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసింది. దీనిపై జగన్ స్పందన ఎలా ఉండబోతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇక ఈ ఏడాది విదేశీ టూర్ సాఫీగా సాగిపోవడంతో జగన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతను కలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జగన్ బెంగళూరు నుంచి ఎప్పుడు తాడేపల్లి వస్తారనేది వాకబు చేస్తున్నారు. మరోవైపు జగన్ వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లపై వైసీపీ దృష్టి పెట్టనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న భూ కేటాయింపులపైనా జగన్ ఫోకస్ చేస్తారని అంటున్నారు.