‘మావిగన్’తోనే ఎన్నికలకు వెళ్తాం.. మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన
రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సంచలన ప్రకటన చేశారు.
By: Tupaki Political Desk | 1 July 2026 4:21 PM ISTరాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సంచలన ప్రకటన చేశారు. తాను ‘మావిగన్’ ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ రాజధానిగా ప్రచారం చేస్తామని, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ మావిగన్ ను చేరుస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే జరుగుతాయని వ్యాఖ్యానించారు. అమరావతి కావాలనుకునేవాళ్లు టీడీపీ, మావిగన్ రాజధాని చేయాలన్న వారు వైసీపీకి ఓట్లేస్తారని జగన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి రాజధానిపై చేసిన ప్రకటన తీవ్ర సంచలన చర్చగా మారింది.
ఎవరు ఔనన్నా, కాదన్నా తమ పార్టీ ‘మావిగన్’ రాజధానికే కట్టుబడి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్లే సాగుతాయని చెప్పడం ద్వారా.. రాజధానిని ఎన్నికల ప్రచార అస్త్రం చేస్తామని మాజీ సీఎం జగన్ వెల్లడించారని అంటున్నారు. దీంతో రాజధాని అంశంపై ఊగిసలాటకు తెరదించుతూ వైసీపీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం రాజధాని అమరావతిలో పర్యటించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మాజీ సీఎం జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మావిగన్ ప్రతిపాదనే తమ ప్రధాన అజెండాగా ఉంటుందని తేల్చిచెప్పారు.
ఇక మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు రాజధానిపై మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై గందరగోళం నెలకొందని అంటున్నారు. రాజధాని అమరావతిని వ్యతిరేకించని పక్షంలో మళ్లీ మావిగన్ మాట ఎందుకంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము రాజధాని అమరావతికి వ్యతిరేకం అని ప్రకటించి, మావిగన్ ను రాజధాని చేస్తామని ఎన్నికలకు వెళ్లొచ్చు కదా? అంటూ నిలదీస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధానిగా ప్రకటించాలని, దీనికి మావిగన్ అని పేరు పెట్టాలని జగన్ రెడ్డి గతంలో ప్రకటించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించిన సమయంలో జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఎన్నికలకు ముందు వరకు మూడు రాజధానులు అంటూ చెప్పిన వైసీపీ అధినేత, రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పించిన సమయంలో మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం విస్తృత చర్చకు దారితీసింది. ఇక అప్పటి నుంచి వైసీపీ నేతలు మావిగన్ తమ రాజధానిగా చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మావిగన్ ను ఎన్నికల అజెండాగా చేస్తామని జగన్ రెడ్డి ప్రకటించడంతో ఈ సారి రాజధానిపై ఆ పార్టీ వైఖరి మరింత స్పష్టంగా తేలిపోయిందని అంటున్నారు.
