మిథున్ రెడ్డిదే భారం.. జగన్ తేల్చేశారు!
ఏపీ మాజీ సీఎం, విపక్షం వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పెద్ద భారమే మోపారు.
By: Tupaki Political Desk | 3 Oct 2025 2:49 PM ISTఏపీ మాజీ సీఎం, విపక్షం వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పెద్ద భారమే మోపారు. మద్యం కేసులో అరెస్టు అయి 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డికి ఏ మాత్రం విరామం ఇవ్వకుండా పార్టీ బాధ్యతలు బదలాయించారు జగన్. ఈ పరిణామం ఎంపీపై జగన్ కు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అంటున్నారు.
రాయలసీమలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబానికి మంచి బలం, బలగం ఉన్నాయనే అభిప్రాయం ఉంది. వైసీపీ కూడా ఈ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. గత ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నప్పటికీ, రాయలసీమలో బలమైన కేడర్ ఉండటం వల్ల మళ్లీ పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే కార్యకర్తలకు భరోసా కలిగించే నాయకుడు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో ఆ బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
నిజానికి వైసీపీలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర. అధినేత జగన్ ను సంప్రదించకుండానే ఏ నిర్ణయం అయినా తీసుకునేటంత స్టామినా ఆయనకు ఉందని కార్యకర్తలు, వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన జగన్ కు నమ్మిన బంటుగా ముద్రపడటమే. మిథున్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని జగన్ తిరస్కరించే పరిస్థితి ఇంతవరకు ఎదురుకాలేదని అంటున్నారు. అందువల్లే జైలు నుంచి వచ్చి విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఆయనకు ఇవ్వకుండా రాయలసీమలోని కీలకమైన ఉమ్మడి అనంతపురంతోపాటు కోస్తాలోని పార్టీకి బలమైన పునాదులు ఉన్న నెల్లూరు బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు.
గత ఎన్నికలకు ముందు మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించేవారు. 2019 ఎన్నికల్లో ఆయన వ్యూహాలే గోదావరి జిల్లాల్లో ఘన విజయం సాధించిపెట్టాయని జగన్ నమ్ముతారని అంటున్నారు. దీంతో ఎన్నికల తర్వాత పార్టీ దెబ్బతిన్న నెల్లూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాల బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత తాత్కాలికంగా ఈ జిల్లాల బాధ్యులుగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించారు. అయితే మిథున్ రెడ్డి మళ్లీ ఈ బాధ్యతలు తీసుకునేవరకు వారు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోయారని అంటున్నారు.
దీంతో పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగిస్తూ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ వారంలోనే ఆయా జిల్లాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. అధినేత ఆదేశాలతో ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఆయా జిల్లాల నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారని, ఒకటి రెండు రోజుల్లోనే సమావేశాల షెడ్యూల్ ప్రకటిస్తారని చెబుతున్నారు.
