Begin typing your search above and press return to search.

వైసీపీలో జగన్ గుబులు...ఏమి జరుగుతోంది ?

వైసీపీకి సర్వసత్తాక నాయకుడు వైఎస్ జగన్ అన్నది తెలిసిందే. ఆయన అనుకుంటే ఎవరికి అయినా పార్టీలో చాన్స్ దక్కుతుంది.

By:  Satya P   |   1 Oct 2026 8:00 AM IST
వైసీపీలో జగన్ గుబులు...ఏమి జరుగుతోంది ?
X

వైసీపీకి సర్వసత్తాక నాయకుడు వైఎస్ జగన్ అన్నది తెలిసిందే. ఆయన అనుకుంటే ఎవరికి అయినా పార్టీలో చాన్స్ దక్కుతుంది. లేకుంటే మాజీ అవుతారు. అయితే పార్టీలో ఏ నిర్ణయం అయినా నలుగురితో కలిసి తీసుకుంటే దాని ఫలితాలు బాగుంటాయని అంటున్నారు. ఉదాహరణకు టీడీపీలో అధినాయకుడు చంద్రబాబు అయినా సీనియర్ల సలహా సూచనలతో నిర్ణయాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. అదే వైసీపీలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంటోందని అంటున్నారు. దాంతో వైసీపీలో భరోసా ఇవ్వాల్సిన చోట గుబులు చెలరేగుతోంది అని అంటున్నారు. ఎపుడు ఎవరికి ఎలా ఉంటుందో అసలు అర్ధం కావడం లేదని అంటున్నారు.

సడెన్ చేంజేస్ తో :

తాజాగా చూస్తే మంగళగిరి వైసీపీ ఇంచార్జిగా కొత్త నాయకుడిని నియమించారు. బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని కొత్తగా పార్టీ ఇక్కడ ఎంపిక చేసింది. దీంతో గత కొంతకాలంగా మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్న దొంతిరెడ్డి వేమారెడ్డి అవుట్ అయ్యారు. ఇక మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వేణుగోపాల సోమిరెడ్డి మంగళగిరి పరిధిలో వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందారు. అలా అర్ధ బలంతో పాటు అంగబలం దండీగా ఉన్న బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని ఏరి కోరి ఎంపిక చేశారు. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగిన ఈ నియామకం అయితే పార్టీ వర్గాలలో చర్చకు తెర లేపింది. ఇక్కడ మంత్రి టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో ఆయన్ని ఢీ కొట్టేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే హెచ్చరిక :

ఈ అనూహ్యమైన మార్పుతో వైసీపీలో కొత్త చర్చ సాగుతోంది. అంతే కాదు ఇంచార్జిలలో కలవరం రేగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో సరైన తీరున రాజకీయ ప్రదర్శన చేయకపోయినా లేదా ఏకగ్రీవాలు జరిగినా మీ ఇంచార్జి పదవికి ఇబ్బంది అని అధినాయకత్వం ఈ మధ్య కాలంలోనే స్పష్టం చేసిన సంగతి విధితమే. ఇపుడు ఎన్నికలు జరగకుండా కూడా ఈ మార్పులు చోటు చేసుకోవడంతో ఇంచార్జిలకు ఎలా ముందుకు పోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు సహజం అని అంటున్నారు. అలాంటిది వాటిని చూపించి తమ ఇంచార్జిల పదవులకు ఎసరు పెడతామంటే ఎలా అన్నదే నేతల అంతర్మధనంగా చెబుతున్నారు.

అసలుకే ఇబ్బంది :

పార్టీలో నాయకులకు సమయం ఇవ్వాలి. భరోసాగా అధినాయకత్వమే నిలవాలని అంటున్నారు. ఆ విధంగా జరగకపోతే నియోజకవర్గాలలో నాయకత్వం డోలాయమానంలో పడుతుందని అంటున్నారు. తాము రేపటి రోజున ఇంచార్జిగా ఉంటామో లేదో అన్న అభద్రతా భావంతో వారు సరిగ్గా పనిచేయలేకపోవచ్చు అని అంటున్నారు. అంతిమంగా ఇది పార్టీ పనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. ఇక అనేక నియోజకవర్గాలలో తరచూ నాయకత్వాలను మార్చడం వల్ల వర్గ పోరు హెచ్చడం తప్ప ఫలితం ఉండదని అంటున్నారు. అంతే కాదు ఎపుడు ఎవరి మెడ మీద కత్తి వేలాడుతుందో అన్న ఆందోళనతో పార్టీలో సైతం దూకుడు తగ్గిపోతుందని అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం వెర్షన్ చూస్తే పనిచేయని వారిని పక్కన పెట్టడమే బెటర్ అన్నట్లుగా ఉంది. ప్రజలే ఆదరించేది కాబట్టి వారినే పార్టీ హైకమాండ్ గట్టిగా నమ్ముకుని ముందుకు సాగుతోంది. కానీ పార్టీ యంత్రాంగం కూడా గట్టిగా ఉంటేనే ఫలితాలు అన్నది తెలుసుకోవాలని సూచనలు వినవస్తున్నాయి.