వైనాట్ పులివెందుల... గర్జిస్తున్న టీడీపీ.. జగన్ ప్రకటనతో మారిన సీను!
అంతేకాకుండా ఎక్కడైనా పొరపాటున ఏకగ్రీవం అయితే సంబంధిత నియోజకవర్గ ఇంచార్జి బాధ్యత వహించాల్సివస్తుందని, వారు ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు వదులుకోవాల్సిందేనంటూ తేల్చిచెప్పారు.
By: Tupaki Political Desk | 29 Aug 2026 5:00 PM ISTస్థానిక ఎన్నికలకు టీడీపీ సమాయుత్తమవుతోంది. అధికారం అండగా ఉండటంతో మెజార్టీ స్థానాలను సునాయాశంగా గెలుచుకుంటామని ఆ పార్టీ కేడర్ లో ధీమా కనిపిస్తోందని అంటున్నారు. అయితే తామేమీ తక్కువ కాదని, స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని వైసీపీ అధిష్టానం కూడా బలమైన సంకేతాలు ఇస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేనకు అధికార బలం ఉన్నప్పటికీ తాము వెన్నుచూపే పరిస్థితి ఉండదని, రాష్ట్రంలో ఎక్కడా ఒక్క చోట కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం లేకుండా పనిచేయాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తన పార్టీ నేతలను ఆదేశించారు. అంతేకాకుండా ఎక్కడైనా పొరపాటున ఏకగ్రీవం అయితే సంబంధిత నియోజకవర్గ ఇంచార్జి బాధ్యత వహించాల్సివస్తుందని, వారు ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు వదులుకోవాల్సిందేనంటూ తేల్చిచెప్పారు.
ఎన్నికలకు ఒకపక్క ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపున పార్టీలు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జారీ చేసిన అల్టిమేటంను అధికార టీడీపీ సవాల్ గా తీసుకుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఏకగ్రీవం అవడానికి వీల్లేదని, ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఆయా నియోజకవర్గ ఇంచార్జులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వనంటూ జగన్ చేసిన హెచ్చరికలను సాకుగా తీసుకున్న టీడీపీ.. మాజీ సీఎం సొంత నియోజకవర్గంలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి రంగంలోకి దిగారని, తన చిరకాల ప్రత్యర్థి జగన్మోహనరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేలా పులివెందుల నియోజకవర్గంలో పలు పంచాయతీలు, మండలాల్లో ఏకగ్రీవ ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఏకగ్రీవ ఎన్నికలకు వీల్లేదని జగన్ ప్రకటన చేసిన మరుక్షణం నుంచే పులివెందులతోపాటు వైసీపీలోని బడా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు నియోజకవర్గాలపై కూటమి పార్టీల నేతలు ఫోకస్ చేశాయని అంటున్నారు. వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, గుడివాడ అమరనాథ్, పేర్ని నాని, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తదితరుల నియోజకవర్గాలలో ఏకగ్రీవ ఎన్నికల దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయా జిల్లాల నేతలకు ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు.
మరోవైపు పులివెందుల నియోజకవర్గంపై రాష్ట్రస్థాయి నేతలతో ప్రత్యేక టీమును రంగంలోకి దించుతున్నారని కూడా చెబుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జి బీటెక్ రవితోపాటు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి పులివెందుల టాస్క్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ముగ్గురు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని కూడా చెబుతున్నారు. పులివెందుల పరిధిలోని మొత్తం ఆరు మండలాలు ఉండగా, టీడీపీ మూడు మండలాల్లో బలంగా ఉందని చెబుతున్నారు. ఈ మూడు చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తలెత్తుకోకుండా చేయాలని టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోందని అంటున్నారు.
గత ఏడాది జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి భార్య ఘన విజయం సాధించగా, వైసీసీ అభ్యర్థి డిపాజిట్ తెచ్చుకోలేకపోయారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి చేసిన హెచ్చరికలతో ఆయనకే ఎసరు పెట్టేలా టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తుందనే సమాచారం వేడిపుట్టిస్తోంది. మరోవైపు మాజీ సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏకపక్ష విజయానికి వైసీపీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందని అంటున్నారు. టీడీపీకి అధికారం ఉన్నప్పటికీ జన బలం తమకే ఉందని నమ్ముతున్న వైసీపీ నేతలు ఎంపీ అవినాశ్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల వారీగా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ చేసిన హెచ్చరికలతో టీడీపీ వైనాట్ పులివెందుల అంటుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
