జగన్ కేసీఆర్ మూడో ఫ్రంట్ ముచ్చట్లు ?
అలా జరుగుతుందా ఈ ఇద్దరు నేతలూ మూడో ఫ్రంట్ కడతారా. దేశ రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పుతారా ఇవన్నీ ప్రశ్నలే.
By: Satya P | 22 April 2026 9:14 AM ISTఅలా జరుగుతుందా ఈ ఇద్దరు నేతలూ మూడో ఫ్రంట్ కడతారా. దేశ రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పుతారా ఇవన్నీ ప్రశ్నలే. ఇంకా చెప్పాలీ అంటే ఊహాగానాలే కూడా. ఎందుకంటే ఈ ఇద్దరూ రాజకీయంగా మంచి స్నేహితులు అని ప్రచారంలో ఉన్నా ప్రస్తుతం ఇద్దరి రాజకీయాలూ కొంత ప్రతికూల వాతావరణంలో సాగుతున్నాయి. ఇద్దరూ మాజీ సీఎంలు అయ్యారు. ఇద్దరూ విపక్షంలోకి వచ్చేసారు. రెండు చోట్లా బలమైన ముఖ్యమంత్రులతో పోరాటం చేయాల్సి వస్తోంది. దానికి తోడు ఇద్దరి రాజకీయ ప్రత్యర్ధులు వేరుగా ఉన్నారు. ఏపీలో టీడీపీతో జగన్ ఫైట్ చేస్తున్నారు. అవతల కాంగ్రెస్ తో కేసీఆర్ రాజకీయ యుద్ధం చేస్తున్నారు. అంతే కాదు జగన్ బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారు. కేసీఆర్ కి తెలంగాణాలో బీజేపీ కూడా ఒక రాజకీయ ప్రత్యర్ధి గానే ఉంది అన్నది రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
జగన్ సరెండర్ అంటూ :
ఇదిలా ఉంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం లో నడిచే ఎన్డీయే ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ పార్టీ వైసీపీ మద్దతు ఇస్తోంది. తాజాగా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది అంతా కూడా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని గగ్గోలు పెడుతున్న వేళ జగన్ మద్దతు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఆయన జాతీయ స్థాయిలో విపక్షాల తీరుని గట్టిగా విమర్శించారు. బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. ఇదే మరింతగా న్యూట్రల్ రాజకీయ వర్గాలకు సైతం ఆగ్రహం కలిగేలా చేసింది అని అంటున్నారు. జగన్ బీజేపీకి సరెండర్ అయిపోయారు అంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి విమర్శలు వచ్చిపడ్డాయి.
గోనె కీలక సలహా :
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు జగన్ వైసీపీని పెట్టిన తొలి నాళ్ళలో ఆయనతో కలిసి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గోనే ప్రకాశరావు అయితే జగన్ తీరుని పూర్తిగా తప్పుపట్టారు. జగన్ ఉంటే ఎన్డీయేలో ఉండాలి లేకపోతే ఇండియా కూటమిలో ఉండాలి. అటూ ఇటూ కాకుండా ఏమిటీ రాజకీయ వైఖరి అంటూ గోనె దుయ్యబెట్టారు. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం ఇష్టం లేకపోతే కేసీఆర్ తో కలసి జగన్ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని కీలక సలహా కూడా ఇచ్చారు. మీ ఇద్దరూ మిత్రులే కదా అని కూడా అన్నారు. ఈ విధంగా బయట ఉంటూ ఎన్డీయేకు మద్దతు ఇవ్వడమేంటని ఎకసెక్కమాడారు.
అది కుదిరే పనేనా :
గోనె ప్రకాశరావు ఇచ్చిన సలహా బాగానే ఉన్నా అది కుదిరే పనేనా అని అంటున్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు బీఆర్ఎస్ పేరుతో ప్రయోగాలు చేసిందే మూడో ఫ్రంట్ కోసం. కానీ అసలుకే ఎసరు వచ్చింది. ఇపుడు తెలంగాణాలో అధికారం దక్కించుకోవడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యం. జగన్ విషయం చూస్తే ఆయన ఏపీ గడప దాటి బయట రాజకీయాలు చేసేందుకు అసలు ఇష్టపడరు. కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతూ వస్తున్నారు. పైగా బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. దానికి కారణం ఎవరికీ తెలియదు కానీ కాంగ్రెస్ వ్యతిరేకత అని అంటున్నారు. ఇక 2029 లో దేశంలో రెండే కూటములు పోటీ పడే సీన్ ఉంది. అవి ఎన్డీయే ఇండియా కూటములు. జగన్ కి ఇండియా కూటమి బహు దూరం. అందులో కాంగ్రెస్ ఉంది కాబట్టి చేరే ప్రసక్తి లేదు.
నిలకడ లేని రాజకీయం :
అలాగని ఎన్డీయేలో చేరాలీ అంటే అందులో ఇప్పటికే చంద్రబాబు పవన్ ఉన్నారు. పైగా తనకు ఉన్న మైనారిటీ ఓట్లు పోతాయని జగన్ బాహాటంగా పొత్తు పెట్టుకోరు. అలాగని బీజేపీకి కాంగ్రెస్ కి సమ దూరం పాటించేది కూడా లేదని అంటున్నారు. మొత్తం మీద జాతీయ స్థాయిలో వైసీపీది ఒక నిలకడ లేని రాజకీయం అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నా వైసీపీ అధినాయకత్వం మాత్రం తన రూటే సెపరేట్ అంటోంది. సో మూడో ఫ్రంట్ ముచ్చట అయితే జగన్ కేసీఆర్ లు చేసేది ఉండదనే అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఓటమి చెంది కేంద్ర రాజకీయాల్లో మూడవ కూటమిగా ఎవరైనా ముందుకు వస్తే అందులో వైసీపీ కీలకంగా వ్యవహరించవచ్చు అని అంటున్నారు. అలాంటి కూటమికి కేసీఆర్ మద్దతు కూడా ఉండే చాన్స్ ఉందని అంటున్నారు.
