జగన్ ఫుల్ సేఫ్.. రీజన్ ఇదే... !
వైసీపీ అధినేత జగన్ సేఫ్ గా ఉన్నారా? ఆయనపై ఈగ వాలే అవకాశం కూడా లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Garuda Media | 30 Aug 2025 5:00 PM ISTవైసీపీ అధినేత జగన్ సేఫ్ గా ఉన్నారా? ఆయనపై ఈగ వాలే అవకాశం కూడా లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మూడు అంశాలను తీసుకుని విచారణ జరిపిస్తోంది. వీటిల్లో ప్రధానంగా వైసిపి హయాంలో జరిగిన మధ్య కుంభకోణం లో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దీని విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు దాఖలు చేసిన రెండు చార్జ్ షీట్లలో కూడా జగన్ పేరును అధికారులు ప్రస్తావించారు. అయితే, అనూహ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత ఈ విచారణ మందగించింది.
దీని వెనక బిజెపి పెద్దల వ్యూహముందుని, బిజెపి వైపు నుంచి ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో నెమ్మదించింది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక రెండోది.. ముఖ్యంగా రాష్ట్రాన్ని కుదిపేసిన వ్యవహారం వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు. ఈ విషయంలో కూడా జగన్ సేఫ్ అయిపోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని పెద్దలు వైసిపి తో టచ్ లో ఉండడం, వైసిపి నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉండడం ప్రతి చిన్న విషయానికి వైసీపీ నాయకులను పొగడ్డం వంటివి ఆసక్తిగా మారింది.
దీంతో ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు సైతం ఆనందంగా ఉన్నారు. అదే విధంగా జగన్ అయితే అసలు ఈ విషయాన్ని పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి బిజెపి నుంచి ఏ తరహా సహకారం లభిస్తుంది? అన్నది స్పష్టమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇక మూడో అంశం వైసిపి హయాంలో జరిగిన జగనన్న ఇళ్ల కార్యక్రమం. దీనిలో కూడా అవకతవకలు జరిగాయని భారీ ఎత్తున వైసిపి నాయకులు ప్రభుత్వ సొమ్మును కాజేశారు అన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేల కిందట నిర్ణయించుకుంది.
ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో.. ఎక్కడెక్కడ విమర్శలు వచ్చాయో.. ఆయా ప్రాంతాల్లోని జగనన్న కాలనీలపై విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కూడా భావించారు. అయితే అనూహ్యంగా ఇది కూడా తెరచాటుకు వెళ్లిపోయింది. దీని వెనుక కూడా బిజెపి పెద్దలకు వ్యూహం అన్నది టిడిపి నేతల మధ్య జరుగుతున్న చర్చ. ఇలా ప్రతి విషయంలోనూ ఇక జగన్ జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. అయితే రాజకీయంగా మాత్రం విమర్శలు ప్రతి విమర్శలు కామనే.
కానీ, భారీ స్థాయిలో చర్యలు తీసుకునే లాగా చట్టం ముందు నిలబెట్టేలాగా ఇకపై పరిస్థితులు ఉండకపోవచ్చు అని అంటున్నారు. ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ వైపు మొగ్గు చూపడం, కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వైసీపీ చలించకుండా బిజెపి కోసమే నిలబడినట్టుగా సంకేతాలు పంపించిన నేపద్యంలో పూర్తిస్థాయిలో జగన్‌కు రక్షణ కల్పించే దిశగా బిజెపి పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కలిపినట్టు సమాచారం. మరి ఇది ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
