పరామర్శలకు వెళ్లే వేళ..టపాసులు కాల్చుడేంది జగన్?
టూవీలర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని.. పదివాహనాలకు అనుమతి ఇస్తామని.. వంద మందితో పరామర్శ యాత్ర చేపట్టాలని చెప్పారు.
By: Garuda Media | 5 Nov 2025 12:34 PM ISTతుపాను బాధితుల కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్ర జరిగిన తీరు చూసినప్పుడు పోలీసులు విధించిన పరిమితులు పక్కాగా అమలైతే మంచి జరిగేదన్న భావన సర్వత్రా కలగటం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. తుపాను బాధితుల పరామర్శ కోసం అనుమతి కోరిన సమయంలో పోలీసులు విస్పష్టమైన అంశాల్ని ప్రస్తావించారు. టూవీలర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని.. పదివాహనాలకు అనుమతి ఇస్తామని.. వంద మందితో పరామర్శ యాత్ర చేపట్టాలని చెప్పారు.
ఈ పరిమితులకు భిన్నంగా జగన్ పరామర్శ యాత్ర సాగింది. పుస్తకాల మీద ఉండే నిబంధనలు ఎలా అయితే అమలు కావో.. సరిగ్గా అదే తీరులో జగన్ పరామర్శ యాత్రకు పోలీసులు విధించిన పరిమితులు అస్సలు అమలు కాలేదు. విజయవాడ నుంచి మొదలైన జగన్ కాన్వాయ్.. గోసాల.. గండిగుంట.. గోపువానిపాలెం.. బల్లిపర్రు.. నిడమోలు.. గూడూరు.. రామరాజుపాలెం.. ఎస్ఎన్ గొల్లపాలెం వరకు ప్రతి చోటా ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కొన్నారు. భారీ ఎత్తున వైసీపీ క్యాడర్ కాన్వాయ్ లోకి చేరటంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జాం అయిన పరిస్థితి.
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకే పరామర్శల కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంటే.. ఏకంగా రాత్రి ఏడు గంటల వరకు సాగిందంటే.. పరామర్శ కాస్తా బలప్రదర్శనగా మారిందన్న మాట వినిపిస్తోంది. పలుచోట్ల జగన్ రాకను సంబరంగా మారుస్తూ వైసీపీ శ్రేణులు టపాసులు కాల్చే ప్రయత్నం చేయటం.. పోలీసులు అడ్డుకోవటం కనిపించింది. తుపాను బాధితులను పరామర్శకు రావటం అంటే.. కష్టంలో ఉన్న వారికి సాంత్వన కలిగేందుకు జరిపే యాత్ర.
అందుకు భిన్నంగా టపాసులు కాలుస్తూ.. విజయోత్సవ యాత్ర మాదిరి నిర్వహించిన వైనం బాధితులకు సాంత్వన కలగకపోగా.. అందుకు భిన్నంగా వారు రియాక్టు అయ్యే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. తమ అభిమాన నేత వస్తున్నారన్న ఉత్సాహంతో ప్రదర్శించే అత్యుత్సాహాన్ని నియంత్రించాల్సిన బాధ్యత జగన్ మీద ఉందన్నది మర్చిపోకూడదు. పరామర్శ అన్నది జగన్ కు మైలేజీగా ఉండాలే తప్పించి.. డ్యామేజీగా మారకూడదన్నది మర్చిపోకూడదు.
