జగన్ ఇమేజ్.. కేసీఆర్ కటౌట్లు.. ఈ హంగామా వెనక స్టోరీ ఇదే..?
ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇద్దరికి తెరవెనక చెలిమి ఉంది.
By: Garuda Media | 24 Aug 2026 10:36 PM ISTఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇద్దరికి తెరవెనక చెలిమి ఉంది. ఏపీలో వైసీపీ కేడర్, తెలంగాణలోని బీఆర్ఎస్ కేడర్ సోషల్ మీడియాలో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు పాజిటివ్ కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు. జగన్, కేసీఆర్ ఇద్దరికి కామన్ శత్రువులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి. అందుకే ఈ రెండు పార్టీల మధ్య కోపరేషన్ మామూలుగా ఉండదు. ఏపీలో గత సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాడన్న సమాచారం తన వద్ద ఉందని కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు. దీనిని బట్టే కేసీఆర్- జగన్ మధ్య పరస్పర అభిమానం ఉందని క్లీయర్‌గా అర్థమవుతోంది.
తాజాగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నగరంలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన జగన్‌కు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు భారీ ఎత్తున స్వాగత తోరణాలు, కటౌట్‌లు వెలిశాయి. సాధారణంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ ఏర్పాట్లు చేస్తే వింత లేదు కానీ, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఈ కటౌట్లు ఏర్పాటు చేయడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లను బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేయడం వెనుక రెండు పార్టీలకు బలమైన రాజకీయ అవసరాలు ఉన్నాయన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా గులాబీ దళం ఈ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ రాజకీయ కార్యకలాపాలు లేకపోయినా.. గ్రేటర్ పరిధిలో జగన్‌కు అభిమానులు, ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం- కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వైసీపీ అభిమానులు అందరూ వన్‌సైడ్ గా బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. తర్వాత 2019 ఏప్రిల్లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆంధ్రాకు వచ్చి మరీ వైసీపీని గెలిపించమని చెప్పారు.
అలా ఆ బంధం రెండు పార్టీల నేతల మధ్య కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ, జగన్ అభిమానుల ఓట్ల కోసమే అక్కడ బీఆర్ఎస్ నేతలు జగన్,కేసీఆర్ కలిసిన కటౌట్లు పెట్టారన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ ఇమేజ్‌ను వాడుకుని, ఆయన అభిమానుల ఓటు బ్యాంక్‌ను రాబోయే ఎన్నికల్లో తమ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పెద్దల ఆశీస్సులతోనే ఈ స్వాగత తోరణాలు వెలిశాయనే చర్చ జోరుగా సాగుతోంది.
