అచ్చి వచ్చిన చోటుకు...ఆగస్టు నెలలో జగన్ షిఫ్ట్ ?
ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో నివాసం ఉండేవారు. అక్కడ నుంచే ఆయన పొలిటికల్ యాక్టివిటీ అంతా సాగేది.
By: Satya P | 18 Jun 2026 9:05 AM ISTవైసీపీ అధినేత జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఫ్యాన్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సెంటిమెంట్ పరంగా వైసీపీకి అచ్చి వచ్చిన చోటకు మకాం మారుస్తున్నారు అన్నదే ఆ ప్రచారం. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది. అది లగాయితూ జగన్ బెంగళూరు టూ తాడేపల్లి అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ లో ఆయన నివాసం ఉంటున్నారు. వీక్ డేస్ లో తాడేపల్లి వస్తున్నారు. మరి ఇప్పటికి రెండేళ్ళు పూర్తి అయిపోయాయి. 2029 ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా రీచార్జి కావాలీ అంటే జగన్ నేతలకు అందరికీ మరింతగా అందుబాటులో ఉండాలి. అందుకే ఈ షిఫ్టింగ్ అని అంటున్నారు.
సెంటిమెంట్ పరంగానూ :
ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో నివాసం ఉండేవారు. అక్కడ నుంచే ఆయన పొలిటికల్ యాక్టివిటీ అంతా సాగేది. అలా లోటస్ పాండ్ సెంటిమెంట్ అచ్చి వచ్చి జగన్ 151 సీట్లను సాధించి సీఎం అయ్యారు. ఇపుడు చూస్తే అదే సెంటిమెంట్ ని మళ్ళీ వాడుకోవాలన్నదే వైసీపీ అధినేత ఆలోచన అని అంటున్నారు. పైగా వైసీపీకి చెందిన నాయకులు అంతా హైదరాబాద్ లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నారు. వారందరితో కలసి మాట్లాడాలి అన్నా అందుబాటులో ఉండాలీ అన్నా లోటస్ పాండ్ లో జగన్ నివాసం ఉండడమే బెటర్ అని అంటున్నారు. అందుకే ఈ షిఫ్టింగ్ అని కూడా చెబుతున్నారు.
రెండు జిల్లాలకే పరిమితం :
ఇంకో వైపు చూస్తే జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వస్తున్నా క్రిష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులు తప్పించి పెద్దగా ఇతర జిల్లాల వారు కలవడం లేదు, దూరాభారాల కారణంగానో లేక హైదరాబాద్ లో అధిక శాతం ఉండడం వల్లనో వారంతా తాడేపల్లి వద్ద కనిపించడం లేదు, జగన్ హైదరాబాద్ లోనే మకాం పెడితే వారందరూ టచ్ లోకి వస్తారని రానున్న రోజులలో వైసీపీని మరింతగా ఫుల్ యాక్టివ్ మోడ్ లో పెట్టవచ్చు అన్నదే అధినేత ఆలోచన అని అంటున్నారు.
హైదరాబాద్ నుంచి ఏపీ రాజకీయం :
ఇక లోటస్ పాండ్ లో షర్మిల కూడా ఉంటున్నారు. అయితే సగ భాగం జగన్ కి కూడా అక్కడ వాటా ఉంది అని అంటున్నారు. అందువల్ల అక్కడికి జగన్ షిఫ్ట్ అవుతారని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవహారాలు అన్నీ చక్కబెట్టుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్ కి జగన్ మకాం మార్చవచ్చు అని అంటున్నారు. ఆగస్టు నెల అయితే శ్రావణ మాసం మంచి ముహూర్తం కూడా కుదురుతుందని భావిస్తున్నారు. 2029 ఎన్నికల మీద కోటి ఆశలు వైసీపీ పెట్టింది. దానికి తగినట్లుగానే సెంటిమెంట్లను కూడా జత చేరుస్తోంది. 2019లో గెలిచేందుకు 2017లో పాదయాత్ర మొదలెట్టిన జగన్ 2029లో గెలిచేందుకు 2027లో పాదయాత్ర మొదలెడతారు అని అంటున్నారు. ఇలా 7వ నంబర్ 9వ నంబర్ వైసీపీకి అచ్చి వచ్చినవని భావిస్తున్న ఆ పార్టీ లోటస్ పాండ్ కూడా సెంటిమెంట్ గా కలసి వస్తుందని లెక్క వేస్తోంది. మొత్తానికి చూస్తే జగన్ కూడా మరో రెండు నెలలలో హైదరాబాద్ లో ఉండబోతున్నారు అన్న మాట. ఇప్పటికే ఏపీకి చెందిన అధికార పక్షం నేతలు కీలక నాయకులు అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇపుడు జగన్ కూడా అక్కడే ఉంటే ఏపీ రాజకీయం హైదరాబాద్ నుంచి మరింత రసవత్తరంగా రక్తి కడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
