క్యాడర్ కి ఎమోషనల్ టచ్ ఇస్తున్న జగన్
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల కాలంలో ఒక నినాదం ఇస్తున్నారు. పార్టీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ తరచూ అంటున్నది ఒకటి ఉంది.
By: Satya P | 18 March 2026 4:00 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల కాలంలో ఒక నినాదం ఇస్తున్నారు. పార్టీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ తరచూ అంటున్నది ఒకటి ఉంది. ఈ పార్టీ నా ఒక్కడితే కాదు ఇది అందరిదీ అని జగన్ అంటున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ 16వ వార్షికోత్సవాల సందర్భంగా కూడా జగన్ ఇదే మాట అన్నారు. వైసీపీని స్థాపించినపుడు తాను ఒక్కడినే ఉన్నాను అని చెప్పారు. అయితే ఇపుడు మాత్రం తనతో పాటు లక్షలాది మంది క్యాడర్ ఉన్నారని గర్వంగా ఉందని చెప్పారు. అంతే కాదు వైసీపీ జగన్ పెట్టారు కాబట్టి ఆయన ఒక్కరిదే అనుకోవద్దని జగన్ చెప్పారు. ఇది మనందరిదీ అని జగన్ పదే పదే చెప్పుకొస్తున్నారు. తాజాగా ఒంగోలు పార్టీ క్యాడర్ సమావేశంలో కూడా జగన్ ఇదే మాట చెప్పారు.
భావోద్వేగ బంధం :
ఏ రాజకీయ పార్టీకైనా కమిటీలు పదవులు ఇవన్నీ ఇటుకులుగా ఉన్నా వాటిని కలిపే భావోద్వేగం అనే సిమెంట్ ఉండాలి. అపుడే ఆ పార్టీ పటిష్టంగా ఉంటుంది. వైసీపీ కూడా ఒక భావోద్వేగం నుంచి పుట్టిన పార్టీ. వైఎస్సార్ తిరుగులేని నాయకుడిగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటున్న నేపథ్యంలో రెండోసారి వరసగా పార్టీని 2009 లో అధికారంలోకి తెచ్చారు. అయితే కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆయన కన్ను మూశారు. అలా వైఎస్సార్ అభిమానం అంతా ఆయన రాజకీయ వారసుడిగా జగన్ వైపు టర్న్ అయింది. అది 2014, 2019 ఎన్నికల దాకా బాగానే ఉపయోగపడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
నిర్వేదంలో క్యాడర్ :
అయితే వైసీపీ అయిదేళ్ల పాటు అధికారం చలాయించినా కూడా క్యాడర్ కి ఏమీ ఒరగలేదన్న బాధ కనిపించింది. దాని కంటే ముందు తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అన్న ఆవేదన వారిలో కనిపించింది. దాంతో 2019లో కసిగా పనిచేసిన క్యాడర్ 2024 కి వచ్చేటప్పటికి కాడే వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. దీని వల్లనే వైసీపీ భారీ ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చిందని కూడా అంటారు అయితే ఇపుడు జగన్ ఓటమి నుంచి సమీక్ష చేసుకుని కొత్త పంధా వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే ఆయన క్యాడర్ ముఖ్యమని అంటున్నారు.
ఈసారి అంతా వారే :
మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని జగన్ ధీమాగా చెబుతున్నారు. వైసీపీ 2.0లో మాత్రం పెద్ద పీట క్యాడర్ కే అని ఆయన గట్టిగా చెప్పుకుంటూ వస్తున్నారు పార్టీకి మూలమైన క్యాడర్ ని ఏ మాత్రం మరచిపోయేది లేదని కూడా జగన్ అంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అంటే తన ఒక్కడిదే కాదని అందరిదీ అని చెబుతున్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతీ కార్యకర్తా బాధ్యత తీసుకోవాలన్నది జగన్ ఆలోచనగా ఆయన పిలుపుగా ఉంది అని అంటున్నారు. క్యాడర్ లో తన పార్టీ అని ఒక భావోద్వేగంతో కూడిన భావన వస్తే కనుక ఆ పార్టీకి తిరుగు ఉండదు, తెలుగుదేశం క్యాడర్ లో ఆ రకమైన భావన నిండుగా ఉంది ఇపుడు వైసీపీలో సైతం దానిని పాదుకొలిపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు.
