జగన్ ఇమేజ్ పై అతి పెద్ద ప్రభావం ?
By: Satya P | 1 Nov 2026 8:58 AM ISTవైసీపీ అధినేత 2009లో తండ్రి అప్పటి ప్రజా నేతగా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ మరణానంతరం నల్లకాలువ వద్ద జనాలకు తొలిసారిగా పరిచయం అయ్యారు. ఆనాడు ఆయన ఇచ్చిన తొలి స్పీచ్ ని టీవీల నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ జనాలు అంతా అతుక్కుపోయి చూశారు. వైఎస్సార్ ని కోల్పోయిన వారికి ఆయన హావ భావాలతో కనిపించిన జగన్ ని తమ నాయకుడిగా అభిమానులు ముద్ర వేసుకున్నారు. జగన్ అక్కడ నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలెట్టారు. ఇక కాంగ్రెస్ తో విభేదాలు వచ్చినా లేక కొత్త పార్టీ పెట్టినా జైలులో పదహారు నెలలు గడిపినా ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. జగన్ మీద ప్రత్యర్ధులు లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు చేసినా రాజకీయంగా అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక జగన్ కి కష్ట సమయంలో అండగా ఉన్నది సొంత కుటుంబం. అలా వైఎస్సార్ ఫ్యామిలీని అంతటినీ ఒకే ఫ్రేమ్ లో చూడడం జనాలు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవారు అన్నది ఒక విశ్లేషణ.
విభేదాలు సహజమే అయినా :
నిజానికి ఏ కుటుంబంలో విభేదాలు లేవు అని అనుకున్నా వైఎస్సార్ ఫ్యామిలీ వేరు అన్నది జనంలో భావన. ఎందుకంటే అంతటి ప్రజాదరణ ఉన్న నేత ఆయన. ఆయనకు కోట్లాది మంది ప్రజలే కుటుబంగా ఉండేది. మరి ఆయన కుటుంబంలో గొడవలు అంటే జనాలు కూడా తేలికగా తీసుకోరనే అంటారు. జగన్ 2024 ఎన్నికల్లో ఓటమికి కారణం ఆయనకు తల్లితో చెల్లెలుతో విభేదాలు అన్నది కూడా జనంలో ప్రచారం తీవ్ర ప్రభావం చూపించింది అంటారు. లేకపోతే కనీసంగా 50 సీట్లు అయినా వచ్చి బలమైన ప్రతిపక్షంగా ఆయన అసెంబ్లీలో ఉండేవారు అని అంటారు.
ఇపుడు మరో పేరు :
ఇక జగన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రత్యర్ధులు ఆయన తల్లికి చెల్లెలుకు అన్యాయం చేశారు అని అంటారు. ఇపుడు మూడవ పేరు కూడా జత కలిపి కూడా విమర్శల జోరు పెంచుతారు. కారణాలు ఏమైనప్పటికీ మేనకోడలి పెళ్ళి విషయంలో కూడా జగన్ ఇలా చేశారు అన్నది ప్రత్యర్ధులు జనంలో గట్టిగానే చూపిస్తారు. రాజకీయ విమర్శలు వేరు, అవినీతి ఆరోపణలు వేరు, కానీ కుటుంబ బంధాల విషయంలో విమర్శలు వస్తే అవి భావోద్వేగాలతో ముడి పడి ఉన్న అంశాలుగానే జనాలు తీసుకుంటారు. ఈ విషయంలో అయితే వైసీపీ అధినేత జగన్ ఇమేజ్ కే ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయని అంటున్నారు.
అలా అనుకున్న వారు :
ఇక 2024 ఓటమి తరువాత అన్నా చెల్లెలు కలుస్తారు అనుకున్న వారూ ఉన్నారు. కానీ విభేదాలు మరింత పెద్దవి అయ్యాయని అంటున్నారు. దాంతో 2029 ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే దీని మీద వైసీపీ నాయకులు కొందరు అయితే ప్రతీ ఎన్నికకూ ఇవే కుటుంబ గొడవలను ముందు పెడితే జనాలలో కూడా పెద్దగా పట్టింపు ఉండదని అంటున్నారు. అయితే ఎంత కాదనుకున్నా రాజకీయలలో నాయకుల గురించి వారి సొంత విషయాల గురించి జనాలు ఎక్కువగా ఆలోచిస్తారు అని అంటారు. అలా చూసుకుంటే జగన్ ఇమేజ్ ని ఇబ్బంది పెడుతున్న ఈ సున్నితమైన అంశాల విషయంలో వైసీపీ ఏమి చేస్తుంది అన్నదే చూడాల్సి ఉంది. దీంతో పార్టీ నేతలకు ఎలాంటి సంబంధం లేకపోయినా దాని పర్యవసానాలు మాత్రం వారు కూడా అనుభవిస్తున్నారు అని అంటున్నారు.
