రంగంలోకి జగన్ ఆర్మీ... ఏం జరుగుతోంది ?
మరో వైపు ప్రభుత్వం నుంచి అయితే మొక్కుబడిగానే భద్రత దక్కుతోందని వైసీపీ అంటోంది.
By: Satya P | 5 Aug 2025 2:00 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జనంలోకి ఎక్కువగా వస్తున్నారు. ఆయన నెలలో కనీసం రెండు విడతలుగా జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్నారు ఒక వైపు జైలు పాలు అయిన తమ నేతలను పరామర్శిస్తున్నారు మరో వైపు ప్రజా సమస్యల మీద ఆయన రైతుల వద్దకు వెళ్తున్నారు. దీంతో జగన్ పర్యటనల మీద చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో ఆయన పర్యటనలకు భద్రతను కల్పించడం లేదని వైసీపీ తరచూ ఆరోపిస్తోంది రోప్ పార్టీలు లేవని జగన్ చుట్టూ జనాలు పోగు అవుతున్నా కట్టడి చేసే పోలీసు బందోబస్తు పెద్దగా లేదని కూడా విమర్శిస్తోంది.
జగన్ భద్రతపై ఆందోళన :
ఇక తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో చాలా మంది నాయకులు జగన్ వ్యక్తిగత భద్రత మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అని అంటున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ కలిగిన జగన్ కి సెక్యూరిటీని సరిగ్గా ఇవ్వలేదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఇటీవల నిర్వహిచిన జిల్లా పర్యటనలలో భద్రతా లోపాలు ఎన్నో కనిపించాయని అంటున్నారు. దాంతో జగన్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కొత్తగా రంగంలోకి :
మరో వైపు ప్రభుత్వం నుంచి అయితే మొక్కుబడిగానే భద్రత దక్కుతోందని వైసీపీ అంటోంది. దాంతో జగన్ కొత్తగా నలభై మంది దాకా మాజీ ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా ఒక బలమైన సైన్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుటున్నారు. జగన్ చుట్టూ వలయంగా వీరంతా ఉంటారని అంటున్నారు. అంతే కాదు రోప్ పార్టీగా కూడా వీరే పనిచేస్తారని కూడా అంటున్నారు. ఈ కొత్త ఆర్మీ జగన్ ఈ నెల 6న కర్నూలు జిల్లా డోన్ లో పర్యటించే సందర్భంలో తన విధులలోకి చేరుతుందని అంటున్నారు.
రానున్న రోజులలో మరింతగా :
వైసీపీ అధినేత జగన్ రానున్న రోజులలో తన జిల్లా పర్యటనలు పెంచనున్నారని చెబుతున్నారు. ఆయన కేవలం జిల్లా కేంద్రాలకే కాకుండా గ్రామాల్లోకి సైతం వెళ్తారు అని అంటున్నారు. అంతే కాదు తన పర్యటనలను అధికం చేయనున్న క్రమంలో ప్రతీసారీ భద్రత కోసం ప్రభుత్వం వైపు చూడకుండా సొంతంగా రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటే మేలు అన్న తీరులోనే ఈ రకమైన ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు
జగన్ ని కలవడం కష్టం :
అయితే బందోబస్తు ఎక్కువ అయితే జగన్ ని జనాలు సులువుగా కలవలేరన్న అభిప్రాయం ఉంది. జగన్ చుట్టూ రోప్ పార్టీ ఉంటే కనుక ఆయనను దూరం నుంచే చూడాల్సి వస్తుంది ఇదివరకు మాదిరిగా ఆయన చుట్టూ చేరేందుకు అయితే వీలు ఉండదు. అయితే వైసీపీ పెద్దలు తాము కోరుకున్న వారిని దగ్గరకు పిలిపించుకుని వారితోనే మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో భద్రత విషయంలో జగన్ వర్సెస్ కూటమి ప్రభుత్వం అన్నట్లుగా కొన్నాళ్ళ పాటు సాగిన ఒక వివాదానికి వైసీపీయే ఇపుడు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. అయితే జగన్ సొంత ఆర్మీ ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో. జనాల నుంచి ఫిర్యాదులు రాకుండా ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
