Begin typing your search above and press return to search.

పండుగ ఏదైనా వీకెండ్ టూర్ పక్కానేనా? జగన్ ముందస్తు రాఖీపై టీడీపీ ట్రోల్స్!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి రాఖీ పండుగను రెండు రోజుల ముందుగానే జరుపుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Political Desk   |   27 Aug 2026 4:33 PM IST
పండుగ ఏదైనా వీకెండ్ టూర్ పక్కానేనా? జగన్ ముందస్తు రాఖీపై టీడీపీ ట్రోల్స్!
X

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి రాఖీ పండుగను రెండు రోజుల ముందుగానే జరుపుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం రాఖీ పండుగ ఉన్నప్పటికీ, ఆ రోజు ఆయన అందుబాటులో ఉండరనే కారణంతో వైసీపీ మహిళా నేతలు బుధవారమే జగన్‌కు రాఖీ కట్టి సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ ముందస్తు వేడుకలపై అధికార తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉండరని, ఆ సమయంలో ఎలాంటి పండుగలు, జాతీయ ఉత్సవాలు అయినా మాజీ సీఎం పట్టించుకోరని ట్రోలింగ్ చేస్తోంది.

సాధారణంగా ఏ పండుగైనా, వేడుకైనా నిర్ణీత తేదీనే జరుపుకోవడం ఆనవాయితీ అంటూ చెబుతున్న టీడీపీ సోషల్ మీడియా మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు రాఖీ సంబరాలు చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ పోస్టుల వరద పారిస్తోంది. ప్రతి వారాంతంలో జగన్ రెడ్డి బెంగళూరు వెళ్లడం పరిపాటిగా మారిందని విమర్శలు గుప్పిస్తోంది. శుక్రవారం నాడు రాఖీ పండుగ ఉండటంతో, ఆయన ఆ రోజు తాడేపల్లిలో అందుబాటులో ఉండరని చెబుతూ మహిళా నేతలు బుధవారమే వైఎస్ జగన్‌ను కలిసి రాఖీలు కట్టాడాన్ని టీడీపీ హైలెట్ చేస్తోంది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రకరకాల కామెంట్లతో మజీ సీఎంను ట్రోలింగ్ చేస్తోందని చెబుతున్నారు.

ఒక్క రాఖీ పండుగ విషయంలోనే కాకుండా గతంలో జగన్మోహనరెడ్డి వ్యవహరించిన తీరును ఎత్తిచూపుతూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సమైనా, రాఖీ పండుగైనా, లేక మరే ఇతర పండగలు శుక్రవారం నుంచి సోమవారం మధ్యలో వచ్చినా జగన్‌కు వాటితో సంబంధం ఉండదని ఎద్దేవా చేస్తున్నారు. ఆ నాలుగు రోజులు ఆయన బెంగళూరు చెక్కేస్తారని, కేవలం మంగళవారం పూట మాత్రమే తిరిగి తాడేపల్లికి వస్తారని విమర్శిస్తున్నారు. మూడు రోజులు మాత్రమే రాష్ట్రంలో గడిపి, మళ్లీ వీకెండ్ ట్రిప్‌కు వెళ్లిపోతారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత నిత్యం రాష్ట్రానికి దూరంగా బెంగళూరుకే పరిమితమవుతున్నారనే అంశాన్ని తెరపైకి తెస్తున్న టీడీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ముందస్తుగా జరుపుకున్న రాఖీ పండుగ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.