Begin typing your search above and press return to search.

రెడ్ బుక్ కి కౌంటర్ గా డిజిటల్ బుక్ వచ్చేసింది

ఏపీలో న్యూ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. రెడ్ బుక్ అంటూ ఇప్పటిదాకా సాగిన రాజకీయానికి కొత్త మలుపు తిప్పుతూ డిజిటల్ బుక్ వచ్చేసింది.

By:  Satya P   |   24 Sept 2025 3:48 PM IST
రెడ్ బుక్ కి కౌంటర్ గా డిజిటల్ బుక్ వచ్చేసింది
X

ఏపీలో న్యూ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. రెడ్ బుక్ అంటూ ఇప్పటిదాకా సాగిన రాజకీయానికి కొత్త మలుపు తిప్పుతూ డిజిటల్ బుక్ వచ్చేసింది. వైసీపీ తమ పార్టీ వారిని కాచుకోవడానికి రేపటి రోజున అధికారంలోకి వస్తే ఇబ్బంది పెట్టిన వారిని శిక్షిస్తామని చాటి చెప్పేందుకు డిజిటల్ బుక్ ని తీసుకుని వస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఈ తరహా బుక్ ఒకటి వస్తుందని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఇపుడు ఆయన తానే స్వయంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బుక్ ని ఆవిష్కరించారు.

రైజ్ యువర్ ఇష్యూ అంటూ :

ఈ డిజిటల్ బుక్ యాప్ కి. రైజ్ యువర్ ఇష్యూ రీక్లెయిం యువర్ రైట్ అని ఒక స్లోగన్ ఉంచారు. క్యాడర్ అంతా క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయమని సూచించారు. కార్యకర్త ఫోన్ నెంబర్ టైప్ చేస్తే వెంటనే యాప్ నుంచి ఓటీపీ వస్తుంది. అలా ఎంట్రీ ఇచ్చాక తమ ఫిర్యాదుని తమ సమస్యను అందులో పంపుతారు. ఇలా డిజిటల్ బుక్ ని క్యాడర్ మొత్తంగా ఉపయోగించే అవకాశాన్ని అధికారాన్ని ఇచ్చారు. రెడ్ బుక్ మాదిరిగానే ఇది ఉంటుంది కాకపోతే అది టీడీపీ అధినాయకత్వం పెద్దలు వద్ద ఉంటే ఇది డిజిటల్ బుక్ గా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ కార్యకర్త వద్దా ఉంటుంది. వారంతా తమ సమస్యలు చెబుతే వాటిని నమోదు చేసుకుని ఎవరు తమ పార్టీ వారిని బాధపెట్టారో వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుని తగిన విధంగా న్యాయం చేస్తామని వైసీపీ హై కమాండ్ భరోసా ఇస్తోంది.

సినిమా చూపిస్తాం :

డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇక మీదట సినిమాయే చూపిస్తామని అన్నారు. క్యాడర్ మీద ఎవరైనా అన్యాయంగా వ్యవహరిస్తే డిజిటల్ బుక్ అంతా రికార్డు చేస్తుందని అన్నారు. అలా చేసిన అధికారులు కానీ ఎవరైనా కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా పదవీ విరమణ చేసినా కూడా వారిని వెనక్కి తీసుకుని వచ్చి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ అధినేత భరోసా ఇచ్చారు.

రెడ్ బుక్ బాధితులు అంతా :

డిజిటల్ బుక్ ఏర్పాటు వెనక ఉద్దేశ్యం రెడ్ బుక్ వల్ల బాధితులు అయిన వారికి న్యాయం చేయడమే అని అంటున్నారు. వారంతా తమ గోడు వెళ్లబోసుకుంటే వైసీపీ పెద్దలు వాటిని పరిశీలించి తగిన విధంగా న్యాయం చేస్తారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. రెడ్ బుక్ పేరుతో దౌర్జన్యాలు చేస్తే కనుక డిజిటల్ బుక్ ఎంట్రీ తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారు. ఎవరైనా తమ ఇబ్బందులు ఉంటే నిర్భయంగా వ్యక్తం చేయవచ్చు అని డిజిటల్ బుక్ పార్టీకి క్యాడర్ కి ఒక అనుసంధానం అని కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద రెడ్ బుక్ కి కౌంటర్ గానే ఈ డిజిటల్ బుక్ వచ్చేసింది అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో డిజిటల్ బుక్ రిజల్ట్ ఎలా ఉంటుందో.