Begin typing your search above and press return to search.

వికేంద్రీకరణ మంత్రంతో జగన్ రాజకీయ తంత్రం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ది వికేంద్రీకరణ విధానం. ఆయన రూట్ సెపరేటు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భిన్నంగా ఆయన ఆలోచనలు ఉంటాయి.

By:  Satya P   |   9 Aug 2025 11:00 AM IST
వికేంద్రీకరణ మంత్రంతో జగన్ రాజకీయ తంత్రం
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ది వికేంద్రీకరణ విధానం. ఆయన రూట్ సెపరేటు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భిన్నంగా ఆయన ఆలోచనలు ఉంటాయి. బలమైన కేంద్రీకృత వ్యవస్థ ఉంటే దాని ఆసరాతో మిగిలిన ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయవచ్చు అన్నది ఆర్ధిక శాస్త్రం ఔపోసన పట్టిన చంద్రబాబు ఫిలాసఫీ. ఇక రాజకీయ శాస్త్రంలో కూడా బాబు ఏనాడో పీహెచ్ డీ చేసేశారు. అయితే వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అన్నీ సొంతంగా నేర్చుకున్న జగన్ పంధా వేరుగా ఉంటుంది అని అంటారు.

ఎక్కడికక్కడ అన్నట్లుగా :

జగన్ ది వికేంద్రీకరణ విధానం. ఆయన మొత్తంగా కాకుండా ఏ రీజియన్ కి ఆ రీజియన్ అన్నట్లుగా చూస్తారు. అలా అయితేనే డెవలప్మెంట్ అని నమ్ముతారు. అందుకే ఆయన మూడు రాజధానులు అని కూడా నినదించారు. ఆయనకు అమరావతి రాజధాని అన్నది పడదని అన్నారు. కానీ జగన్ ఆలోచన విధానమే డీసెంట్రలైజేషన్ అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. సరే ప్రభుత్వంలో ఉన్నపుడు మూడు రాజధానులు అంటే అసలు కుదరలేదు. కానీ పార్టీలో మాత్రం జగన్ తన ఫిలాసఫీని చక్కగానే అమలు చేస్తున్నారు.

రీజియన్ల వారీగా :

రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది జగన్ అన్నది తెలిసిందే. అంతకు ముందు రాజకీయ పార్టీల వ్యవస్థలో ఈ తరహా నిర్మాణం లేదు. ప్రతీ జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉండేవారు. వారంతా రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులకు బాధ్యులుగా ఉంటూండేవారు. అయితే జగన్ అంచెలంచెల వ్యవస్థను పార్టీలో ప్రవేశపెట్టారు. అలా కో ఆర్డినేటర్లు రీజియన్ల వారీగా నియమితులయ్యారు రాష్ట్రాన్ని అయిదు రీజియన్లుగా విభజించి మరీ వారికి ఈ బాధ్యతలు అప్పగించారు.

అనుబంధ విభాగాలలో :

ఇపుడు అదే తరహా విధానాన్ని అనుబంధ విభాగాలకు కూడా వర్తింప చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో యువజన మహిళా విభాగాలు కీలకంగా ఉంటాయి. ఇక వాటికి రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం ఒక పద్ధతి. అయితే జగన్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. తాజాగా అయిదు రీజియన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాను విడుదల చేశారు. ఉత్తరాంధ్ర కు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్, గోదావరి జిల్లాలకు కారుమూరి సునీల్ కుమార్, , క్రిష్ణా గుంటూరులకు పేర్ని కిట్టూ, నెల్లూరు ప్రకాశం భూమన అభినయ్ రెడ్డి, రాయలసీమ రీజియన్ కి భైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలకు మొత్తం ఇరవై ఆరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

మహిళా విభాగంలో సైతం :

ఇదే తీరున మహిళా విభాగంలో కూడా ఉత్తరాంధ్రా గోదావరి, కోస్తా, నెల్లూరు ప్రకాశం, రాయలసీమల రీజియన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. అలా ఉత్తరాంధ్రాలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమర్తె అనూరాధకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దక్కింది, క్రిష్ణా గుంటూరు కి సంబంధించి క్రిష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాడ హారికకు అవకాశం ఇచ్చారు. ఇలా చూస్తే సామాజిక సమీకరణలను సైతం దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ కూర్పు పూర్తి చేశారు.

విభజించి బిగించి మరీ :

ప్రాంతాల వారీగా విభజించి గట్టిగా బిగించి పార్టీని పటిష్టం చేయాలని జగన్ చూస్తున్నారు. అదే విధంగా ఎక్కువ మంది నాయకులకు అవకాశాలు పార్టీ పరంగా ఇస్తున్నారు. దాంతో వారికి గుర్తింపు దక్కుతోంది. రానున్న కాలంలో వారి సామర్థ్యం బట్టి వారికి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ కూడా దక్కనుంది అని అంటున్నారు. ఎక్కువగా యువతరాన్ని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమర్ధ నేతలను ముందుకు తెస్తూ జగన్ సరికొత్తగా పార్టీ నిర్మాణం చేస్తున్నారు. అలాగే పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయ సంస్థగా పీఏసీని సీనియర్లతో నింపారు. రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఎటూ ఉంది. మొత్తం మీద అంచెలంచెల వ్యవస్థలో జగన్ వైసీపీని గట్టి పరచాలని చూస్తున్నారు. మరి ఆయన అంచనాలను ఏ మేరకు నాయకులు అందుకుంటారు అన్నదే చూడాల్సి ఉంది.