కాంగ్రెస్ లోకి జగన్ ...అయ్యే పనేనా ?
జగన్ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది అన్నది తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి కడప నుంచి తొలిసారి ఎంపీ అయ్యారు.
By: Satya P | 30 Sept 2026 8:03 PM ISTజగన్ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది అన్నది తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి కడప నుంచి తొలిసారి ఎంపీ అయ్యారు. దాని కంటే ముందు ఆయన కుటుంబం మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో పనిచేసింది. అలాంటి జగన్ వైఎస్సార్ మరణం తరువాత అనూహ్యంగా కాంగ్రెస్ కి దూరం అయ్యారు. ఆయన సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. గత పదిహేనేళ్ళుగా ఆయన ఆ పార్టీని నడుపుతున్నారు. రెండు సార్లు ఓటమి ఎదురైనా ఒకసారి బంపర్ విక్టరీని వైసీపీ కొట్టింది. 2029 ఎన్నికల మీద వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఎన్డీయేతో బీజేపీతో వైసీపీ పరోక్ష స్నేహం చేస్తోంది అన్న ప్రచారం సాగుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం తీరు మీద తాజాగా జగన్ చేసిన ట్వీట్ అయితే రాజకీయ చర్చకు తావించింది. ఇది ఎన్డీయేకు కొంత ఇబ్బంది పెట్టేలా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఊహాగానాలు అలా :
ఈ క్రమంలో ఏపీలో వామపక్షాలతో వైసీపీ పనిచేస్తుంది అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఈ మధ్యనే సీపీఐ నాయకులు జగన్ ని కలసి వచ్చారు. ఏపీలో ఉమ్మడి పోరుకు ఈ పార్టీలు సిద్ధపడవచ్చు అన్నది కూడా ప్రచారాంలో ఉన్న మాటగా ఉంది. 2029 ఎన్నికల నాటికి జగన్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారు, అలాగే ఇండియా కూటమిలో చేరుతారు అని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో జగన్ కాంగ్రెస్ లోకి రావాలని ఒక కాంగ్రెస్ ప్రముఖుడు లేటెస్ట్ గా ఇచ్చిన పిలుపు మరింత రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఆ ప్రముఖుడు తెలంగాణాకు చెందిన వారే కాదు, వైఎస్సార్ కి సన్నిహిత నేత, జగన్ తో కూడా మంచి రిలేషన్స్ ఉన్న వారు. ఆయనే తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
ఎక్కువ సంతోషిస్తా :
జగన్ తో సహా కాంగ్రెస్ ని వీడిన వారు అంతా తిరిగి సొంత గూటికి చేరాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపు ఇచ్చారు. ఆయన కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2026లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు తిరిగి సొంత పార్టీలోకి వచ్చి చేరితే అందరి కంటే తానే ఎక్కువ సంతోషిస్తాను అని మల్లు అన్నారు. అంతే కాదు తాను దివంగత నేత వైఎస్సార్ తో కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో జగన్‌తో కలసి నేరుగా పనిచేయకపోయినా పాత నేతలంతా తిరిగి కాంగ్రెస్ లో చేరితే దేశాన్ని, పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేసిన వారవుతారని మల్లు చెప్పుకొచ్చారు.
అలా జరుగుతుందా :
కాంగ్రెస్ ని జగన్ వీడిన తరువాత సొంతంగానే తన రాజకీయ పంధాను సాగిస్తున్నారు. మళ్లీ జగన్ కాంగ్రెస్ లో చేరుతారా అంటే గతంలో జరిగిన పరిణామాలను జగన్ రాజకీయ వైఖరులను విశ్లేషించేవారు అయితే అలా జరిగే అవకాశాలు పెద్దగా ఉండవనే అంటున్నారు. జగన్ సొంత పంధాతో తన సొంత పార్టీతోనే ముందుకు సాగుతారు తప్ప వేరే పార్టీలో చేరేది ఉండదని అంటున్నారు. అవసరం అనుకుంటే అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అది కూడా 2029 ఎన్నికల ముందా తరువాతా అన్నది అప్పటి రాజకీయ పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరితే ఎంతటి నాయకులు అయినా ఢిల్లీ నేతల మాట వినాల్సిందే. జగన్ ఆ విధంగా చేసేది ఉండదని అంటున్నారు. అయితే ఏపీలో జగన్ లాంటి చరిష్మా టిక్ లీడర్ కాంగ్రెస్ లో చేరితే హస్తం పార్టీకి ఏపీలో ఏనుగంత బలం వస్తుంది. అలాగే జగన్ కి కూడా రాజకీయంగా అతి పెద్ద అండ దొరుకుతుంది. కానీ ఇది జరిగేది బహు తక్కువ అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఆశలు ఆకాంక్షలు కొన్ని ఎప్పటికీ తీరనివి ఉంటాయని అంటున్నారు.
