బాబు హయాంలోనే కల్తీ- ..జగన్ హాట్ కామెంట్స్
ఇక సీబీఐ రిపోర్టు చూస్తే బాబు హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగింది అని ఉందని జగన్ అన్నారు.
By: Satya P | 6 Feb 2026 11:51 PM ISTఏపీ సీఎం చంద్రబాబు మీద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పరామర్శించేందుకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ బాబు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. ఆయన చెప్పినది తప్పు అని సీబీఐ రిపోర్టు చెప్పినా ఇంకా దానినే కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు.
బాబు పాలనలోనే :
ఇక సీబీఐ రిపోర్టు చూస్తే బాబు హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగింది అని ఉందని జగన్ అన్నారు. శ్యామలరావు ఈవోగా ఉండగా నాలుగు నెయ్యి ట్యాంకర్లను 2024 జూలై 27న వెనక్కి పంపించారు అని కానీ అవి దొడ్డి దారిన వెనక్కి వచ్చాయని వాటితోనే లడ్డూలు తయారు అయ్యాయని జగన్ ఆరోపించారు. దానికి బాబు జవాబు చెప్పాలని జగన్ కోరారు
తీవ్ర స్థాయిలోనే :
బాబులో ఎందుకో తీవ్ర స్థాయిలో అసహనం పెరిగిపోతోంది అని జగన్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన అసత్య ప్రచారానికి సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ నివేదిక తయారు చేసి తప్పు అని చెప్పినందుకే ఈ అసహనం అని జగన్ అన్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని అసత్యాలు బాబు చెప్పారని కానీ అది తప్పు అని నివేదికలో స్పష్టం గా చెప్పారు అన్నారు. ఆ నివేదిక చూసి బాబు లెంపలేసుకోవాల్సింది పోయి తిరిగి మళ్ళీ అవే ఆరోపణలు చేయడమేంటని జగన్ ఫైర్ అయ్యారు.
సుప్రీం కోర్టు కంటే :
చంద్రబాబు సుప్రీంకోర్టు కంటే గొప్పవారు ఏమీ కాదని జగన్ అన్నారు. గత టీటీడీ చైర్మన్లు భూమన కరుణాకరరెడ్డి వైవీ సుబ్బారెడ్డి తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ తన చార్జి షీటు లో వారి పేర్లను చేర్చలేదని జగన్ గుర్తు చేశారు. ఇంతకీ తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబుకు ఎవరు చెప్పారని జగన్ ప్రశ్నించారు. ఎవరూ చెప్పకుండా ఏ ఆధారం లేకుండా మాట్లాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను బాబు దెబ్బ తీశారని దీనిని గానూ ఆయన క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేసారు.
స్వామి వారికే అపచారం :
కోట్లాది మంది భక్తులు ఆరాధించే వెంకటేశ్వర స్వామి వారినే బాబు అవమానిస్తున్నారు అని అన్నారు. అన్యాయంగా లడ్డూ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో బాబు వైఖరి ఇకనైనా మార్చుకోవాలని ఆయన అన్నారు.
బీసీల మీదంటూ :
బీసీలు ఎదగడం బాబుకు ఇష్టం లేదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ నేత అయిన జోగి రమేష్ మీద ఎందుకు కక్ష కడుతున్నారని నిలదీశారు. ఆయన మీద ఏకంగా పన్నెండు కేసులు పెట్టారని, ఆయన కొడుకు మీద ఏడు కేసులు, భార్య మీద ఒక కేసు పెట్టారని బీసీల మీద ఎందుకు ఈ దారుణమని జగన్ ఫైర్ అయ్యారు. జోగి రమేష్ ఇంటి మీద యాసిడ్ పెట్రోల్ బాంబులను వేయడం ద్వారా హత్య చేయాలను కుట్ర పన్నారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందుకు టీడీపీ వారు గుమి గూడారని జోగి రమేష్ పోలీసులను అప్రమత్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఇది జంగిల్ రాజ్ కాక మరేమిటని జగన్ ప్రశ్నించారు.
