Begin typing your search above and press return to search.

రేపల్లెపై జగన్ పక్కా స్కెచ్.. టీడీపీ కోట బద్ధలు కొట్టే ప్లాన్ రెడీ!

గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా స్కెచ్ వేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా అంగ బలం, అర్ధబలం ఉన్న నాయకులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   24 March 2026 8:00 PM IST
రేపల్లెపై జగన్ పక్కా స్కెచ్.. టీడీపీ కోట బద్ధలు కొట్టే ప్లాన్ రెడీ!
X

2029 ఎన్నికలే టార్గెట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ జగన్ తీసుకుంటున్న జాగ్రత్తలు గమనిస్తే, ఈ సారి పక్కా ప్లాన్ తోనే ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి పుంజుకోవడంపై జగన్ ఫోకస్ చేశారని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

వైసీపీ కేడర్ లో ఉత్సాహం తీసుకువచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అధినేత జగన్. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో చాలా మంది కేడర్ నైరాశ్యంలో కూరుకుపోయారని, వారు ఇంకా అదే ఆలోచనలతో ఉంటే పార్టీకి ఇబ్బందికరమని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా పార్టీ కేడర్ లో జోష్ నింపాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత పార్టీ తీవ్రంగా నష్టపోయిన నియోజకవర్గాలను గుర్తించడమే కాకుండా, ఆయా నియోజకవర్గాల్లో సమర్థులైన నాయకులను ఇంచార్జులుగా నియమిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా స్కెచ్ వేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా అంగ బలం, అర్ధబలం ఉన్న నాయకులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గానికి సమర్థుడైన నేతను ఇంచార్జిగా నియమించాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. రేపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో గడిచిన 10 ఎన్నికల్లో 7 సార్లు టీడీపీయే గెలుపొందింది.

ఇక మంత్రి అనగాని గత మూడు ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నారు. మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈవూరి గణేష్ రాజకీయంగా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గణేష్ కు టికెట్ ఇవ్వడం వల్ల ఆయన సరైన పోటీ ఇవ్వలేకపోయారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపల్లె నియోజకవర్గానికి కొత్త ఇంచార్జిగా పీటా నాగ మోహన్ క్రిష్ణను జగన్ నియమించారు.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్తగా నాగ మోహన్ క్రిష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్థిక స్థోమత, బీసీ గౌడ సామాజిక నేపథ్యం వల్ల నాగ మోహన్ క్రిష్ణ మంత్రి అనగానికి సరైన ప్రత్యర్థి కాగలరని మాజీ సీఎం జగన్ భావించారు. రాజకీయాలకు కొత్త కావడం వల్ల నాగ మోహన క్రిష్ణకు క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయని నిర్ధారణకు వచ్చిన జగన్ రేపల్లి బాధ్యతలను నాగ మోహన క్రిష్ణకు అప్పగించారని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ వ్యూహాత్మక నిర్ణయం వల్ల కంచుకోటలో టీడీపీ గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్క రేపల్లె కాకుండా, టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న అన్ని నియోజకవర్గాలపైనా జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు.