షర్మిల ర్యాలీకి జగన్? ఎవరు చెప్పారంటే..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సవాల్ విసిరింది.
By: Garuda Media | 14 Aug 2025 3:57 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సవాల్ విసిరింది. ఏపీలోని పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్.. బెజవాడలో పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ర్యాలీకి ఆహ్వానించింది. ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనల్లో కలిసి పనిచేద్దాం రమ్మంటూ ఏపీసీసీ పరిశీలకుడు మాణిక్యం ఠాకూర్ పిలుపునిచ్చారు. దేశంలో ‘ఓట్ చోర్’పై ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నించడం లేదన్న విమర్శలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ లైనులో మాట్లాడుకుంటారని, వీరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని బుధవారం మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘ఓటు చోర్’ ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల్లో 12.5 శాతం ఓటింగు వ్యత్యాసంపై మాట్లాడటం లేదని జగన్ నిలదీశారు. చంద్రబాబుతో కుమ్మక్కు కావడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికలను పట్టించుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు.
దీనికి కౌంటరుగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాకూర్, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడివిడిగా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్న జగన్.. ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనల్లో పాల్గొనే దమ్ముందా? అంటూ నిలదీశారు. విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా గళం విప్పాలని సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పోరాటం కోసం పనిచేయడం లేదన్న మాణిక్యం ఠాకూర్, ఏపీలో అధికార విపక్షాలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సంబంధాలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. జగన్ అమిత్ షాతో కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో ఓడినా జగన్ ఆలోచనా విధానం మారలేదని, ఇప్పటికైనా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చి ఓటు చోర్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
