Begin typing your search above and press return to search.

జగన్... ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు వేయించలేడు, కార్యకర్తలే వేయించేది !

క్యాడర్ ముఖ్యం జగన్ అంటున్నారు. వారి మన్ననను అందుకోవాలని కోరుతున్నారు. ఓటు వేయించేది పెద్ద లీడర్లు కాదు, ఎమ్మెల్యేలు కూడా కాదు కార్యకర్తలే జగన్ అని సూచిస్తున్నారు.

By:  Satya P   |   10 Oct 2025 6:00 AM IST
జగన్... ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు వేయించలేడు, కార్యకర్తలే వేయించేది !
X

వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు ఏమిటో ఆయన రాజకీయ దారి ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా ఆయన స్కెచ్ గీసుకున్నారో వ్యూహాలు ఏమిటో తెలియదు కానీ హితైషులు మాత్రం జగన్ కి చెప్పాల్సింది చెబుతూనే ఉన్నారు. క్యాడర్ ముఖ్యం జగన్ అంటున్నారు. వారి మన్ననను అందుకోవాలని కోరుతున్నారు. ఓటు వేయించేది పెద్ద లీడర్లు కాదు, ఎమ్మెల్యేలు కూడా కాదు కార్యకర్తలే జగన్ అని సూచిస్తున్నారు.

చుట్టూ తిరిగే వారే కానీ :

జగన్ కి అందుబాటులో ఉండేది బడా బాబులే పెద్దలే, అంతే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నేతలు. అయితే వీరంతా హై ప్రొఫైల్ లో ఉంటారు. గ్రౌండ్ కి చాలా దూరంగా ఉంటారు, జనాల అభిప్రాయాలు ఏమిటి అన్నది కార్యకర్తలకు తెలిసినంత సులువుగా వారికి అర్థమైనంత వేగంగా వీరికి తెలియవు అని అంటున్నారు. వారు తనతో ఉన్నారని అనుకున్నా లేక తన చుట్టూ కోటరీ ఉందని భావించినా పప్పులో కాలేసినట్లే అని అధినాయకత్వానికి చాలా మంది సూచిస్తున్నారు.

బీ ఫారం తీసుకుంటారంతే :

ఎమ్మెల్యే అభ్యర్ధులు బీ ఫారం తీసుకుంటారు వారు అధినేతతో ఫోటోలు దిగి పార్టీని పొగిడి వెళ్ళిపోతారు. కానీ వారు పార్టీకి ఓట్లు వేయించగలరా అన్నదే పెద్ద ప్రశ్న. వారు వేయించే స్థితిలో ఉండరని అంటున్నారు. వారు జనాల వద్దకు వెల్ళి ఓట్లు అడుగుతారు కానీ ఓట్లు తాము స్వయంగా వేయించలేరు అని అంటున్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో వారికి ఉన్న బంధం అనుబంధం ఒక లెక్కగానే ఉంటుంది అని అంటున్నారు.

పార్టీ సింబల్ తోనే :

నిజానికి జనాలు ఎట్రాక్ట్ అయ్యేది చూసేది సింబల్ నే అని అంటున్నారు. పార్టీ గుర్తుని చూసి ఓటేసే వారే అధికంగా ఉంటారు. వారు గుర్తుని ఎంతో ప్రేమిస్తారు. ఆ గుర్తు ఓటు మీద చూడగానే అలా చేయి వెళ్ళిపోయి గుద్దేస్తుంది. అదే అభ్యర్ధి ఎవరు అంటే ఠక్కున జవాబు చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులు తమ పలుకుబడితో ఓట్లు తెచ్చేది ఏ నాలుగు అయిదు శాతమో తప్ప ఎక్కువగా ఉండదని అంటున్నారు. అయితే ఎక్కువగా ఎమ్మెల్యే అభ్యర్థులే ఫోకస్ అవుతూ ఉంటారు, వారే అధినాయకుడు చుట్టూ కనిపిస్తారు.

కార్యకర్తే జీవగర్ర :

పార్టీ జెండా నిలబడేది కర్ర మీద. అలాగే పార్టీ కూడా కార్యకర్త అనే కర్ర మీద నిటారుగా నిలుచుకుంటుంది. ధీమాగా ఉంటుంది. నిబ్బరంగా కూడా ఉంటుంది. గెలుపు గర్వం పార్టీ చూడాలంటే కార్యకర్తే మూలాధారం. ఏ పార్టీ అయితే క్యాడర్ ని దగ్గరకు తీస్తుందో ఏ పార్టీ అయితే క్యాడర్ ని మచ్చిక చేస్తుందో ఆ పార్టీకి ఎపుడూ ఎదురు ఉండదు, దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తమిళనాడులో చూస్తే కనుక డీఎంకే ఏకంగా 14 ఏళ్ల పాటు అధికారంలోకి రాలేదు, అయినా మూడు నాలుగు ఎన్నికలను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నిలిచి చివరికి గెలిచింది అంటే క్యాడర్ బలం అని అంటున్నారు. టీడీపీ ఉమ్మడి ఏపీలో పదేళ్ళ పాటు అధికారానికి దూరం అయినా మళ్ళీ గెలిచింది అంటే కచ్చితంగా క్యాడర్ కే ఆ గొప్పదనం దక్కుతుంది. క్యాడర్ బేస్డ్ పార్టీలకు నాయకులతో సంబంధం లేదు, అందుకే వైసీపీ కూడా క్యాడర్ ని నమ్ముకోవాలని హితైషులు జగన్ కి సూచిస్తున్నారు.

కేసులను సైతం :

ఇక పార్టీ కార్యకర్తలు కేసులను సైతం తట్టుకుని ముందుకు వస్తారు. పార్టీ అంటే అపరిమితమైన అభిమానం చూపిస్తారు. జెండా మోసేది భారం మోసేది కూడా కార్యకర్తలే అని గుర్తు చేస్తున్నారు. అలాంటి కార్యకర్తలను కలవకుండా కేవలం మీటింగులతో కాలక్షేపం చేస్తే ఒరిగేది ఏదీ ఉండదని అంటున్నారు. జగన్ ఉండాల్సింది క్యాడర్ తోనే అని అంటున్నారు. మరి ఆయన దీనిని గుర్తించి ముందుకు అడుగులు వేస్తారా అన్నదే చూడాల్సి ఉంది.