జగన్ బెంగళూరుకు.. నేతలు టూర్లకు... !
కానీ, సీఎం చంద్రబాబు లండన్ టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన లేని సమయంలో చేసి ప్రయోజనం ఏంటని భావిస్తున్నారో.. ఏమో తెలియదు కానీ.. దీనిని కూడా వాయిదా వేశారు.
By: Garuda Media | 3 Nov 2025 11:39 AM ISTఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అనేది సామెత. ఇప్పుడు ఇది ప్రతి పక్ష వైసీపీకి చక్కగా కుదురుతోంది. ఎందుకం టే.. పార్టీ అధినేత జగన్.. కీలక సమయంలో మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో ఇక, తాము మాత్రం చేసేది ఏముంది? అంటూ.. తాడేపల్లిలో కీలక రోల్ పోషిస్తున్న `` ఆ నలుగురు`` కూడా పర్యాటకం బాట పట్టారు. కొందరు.. ఢిల్లీకి మరికొందరు కలకత్తాకు వెళ్లారు. దీంతో ఇప్పుడు తాడేపల్లి కార్యాలయంలో కేవలం సిబ్బంది మాత్రమే ఉండనున్నారు. దీనిపై వైసీపీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే.. ఎలా? అని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం పార్టీ పరంగా మొంథా తుఫాను బాధిత గ్రామాలలో పర్యటించాలని ముందు భావించారు. దీనికి జగన్ కూడా ఒకే చెప్పారు. సాధ్యమైనంత వరకు తమ తరఫున కూడా సాయం చేస్తామన్నారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకుని .. మీరు చూసుకోండి అంటూ.. ఆయన బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశారు. అదేసమయంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో డెవలప్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత.. వాటిని ప్రభుత్వమే కట్టాలని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించేందుకు కూడా పిలుపునిచ్చారు. ఇది కూడా నవంబరు 2 నుంచి 10 వరకు మరోసారి నిర్వహించాల్సి ఉంది.
కానీ, సీఎం చంద్రబాబు లండన్ టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన లేని సమయంలో చేసి ప్రయోజనం ఏంటని భావిస్తున్నారో.. ఏమో తెలియదు కానీ.. దీనిని కూడా వాయిదా వేశారు. ఇక, జిల్లా స్థాయి నాయకుల ఎంపిక.. పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా జగన్ పక్కన పెట్టారు. దీంతో వైసీపీ నాయకులు డీలా పడ్డారు. తమకు ఏదో పదవి దక్కుతుందని భావించిన వారు.. పార్టీ పరంగా పుంజుకునేందుకు ప్రయత్నించాలని అనుకున్నవారు.. తిరుగు ముఖం పట్టారు. ఇక, తాడేపల్లి కార్యాలయంలో అన్నీతామై వ్యవహరించే వారు కూడా.. పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు కీలక నాయకుడు ఒకరు తెలిపారు.
పార్టీపై ఎఫెక్ట్.. ?
జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా పార్టీపై పెను ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు.. ప్రజలు మొంథా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నా ప్రతి పక్షంగా వైసీపీకి కూడా కొంత మెరుగైన పాత్ర ఉంటుందని.. ఇప్పుడే అసలు పుంజుకునేందుకు అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ పొరుగు రాష్ట్రం బాట పట్టడాన్ని విశ్లేషకులు కూడా తప్పుబడుతున్నారు. ఏదేమై నా.. జగన్ నిర్ణయం.. జగన్‌దే కాబట్టి.. ఆయన వెళ్లిపోయారు. దీంతో పార్టీపై ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న చర్చ అయితే జరుగుతోంది.
