Begin typing your search above and press return to search.

రావాలి జగన్...అసెంబ్లీ వేళ మరోసారి !

రావాలి జగన్ కావాలి జగన్ ఇది వైసీపీ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన నినాదం. అది వర్కౌట్ అయి వైసీపీ గెలిచింది.

By:  Satya P   |   17 Aug 2026 9:27 AM IST
రావాలి జగన్...అసెంబ్లీ వేళ మరోసారి !
X

రావాలి జగన్ కావాలి జగన్ ఇది వైసీపీ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన నినాదం. అది వర్కౌట్ అయి వైసీపీ గెలిచింది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉంది. ఈ నినాదం అవసరం లేదనుకుంది. ఎందుకంటే వై నాట్ 175 అన్న ధీమా వైసీపీది. అయితే ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం అయిపోయింది. ప్రతిపక్ష పాత్ర కూడా వైసీపీకి దక్కలేదు. దాంతో గడచిన రెండేళ్లుగా అసెంబ్లీకి వైసీపీ వెళ్ళడం మానుకుంది. అయితే అసెంబ్లీకి వైసీపీ రావాలని ప్రజాస్వామ్య ప్రియులు అంతా ఇపుడు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా మాజీ సీఎం గా జగన్ సభకు వచ్చి అధికార పక్షాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయాలని వారంతా ఆశిస్తున్నారు. అంటే 2019లో వైసీపీ నినదించినది ఇపుడు జనం రివర్స్ లో అదే వైసీపీకి అప్పగిస్తున్నారు అన్న మాట.

రోడ్ల మీద కాదంటూ :

ఇదిలా ఉంటే ఈ నెల 17 నుంచి ప్రారంభం అయ్యే శాసన సభ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ అసెంబ్లీకి రావాలని సభాధ్యక్షుడి హోదాలో కోరారు. ఆయన సభకు వస్తే ప్రజా సమస్యల మీద అయినా లేదా వైసీపీ లేవనెత్తుతున్న మెగ్గా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అన్న దాని మీద అయినా మంత్రులతో సమాధానలు చెప్పిస్తామని అన్నారు. అలా కాకుండా రోడ్ల మీద జగన్ ఆయన పార్టీ నేతలు తిరిగి డిమాండ్ చేస్తే ఎవరు జవాబు చెబుతారు అని ప్రశ్నించారు. జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు వస్తే విపక్షం అడిగే ఏ ప్రశ్నలకు అయినా మంత్రుల ద్వారా జవాబు చెప్పిస్తామని స్పీకర్ హోదాలో ఆయన హామీ ఇచ్చారు. ఇక వైసీపీకి నిబంధలన ప్రకారం సభ్యుల సంఖ్య లేదని అన్నారు. అలాంటపుడు అర్హత లేనపుడు తాను ఏ విధంగా విపక్ష హోదాని ఇప్పించగలను అని అయ్యన్న ప్రశ్నించారు.

జగన్ వస్తే బాగుంటుంది :

ఇక కూటమిలో మరో కీలక పార్టీ అయిన బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు జగన్ అసెంబ్లీకి రావాలని అన్నారు. ఆయన ప్రతిపక్ష స్థానం తనకు దక్కిందా హోదా ఇచ్చారా అన్నది చూసుకోకుండా ప్రజా సమస్యల మీద సభలో చర్చించాలని కోరారు. గతంలో తమ పార్టీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారు అని అయినా తాను ప్రతిపక్ష పాత్ర పోషించాను అని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఏ కారణం మీద అయినా జగన్ అసెంబ్లీకి రాకపోతే కనుక ఆయన పార్టీ ఎమ్మెల్యేలను అయినా సభకు పంపించాలని విష్ణు కుమార్ రాజు కోరారు.

కుదరదు అంతేనా :

అయితే వైసీపీ ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేదని అంటున్నారు. వైసీపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా విపక్ష హోదా దక్కుతుందని వాదిస్తోంది. దీని మీద హైకోర్టులో కేసు కూడా వేసింది. ఈ నేపధ్యంలో వైసీపీ అసెంబ్లీకి రావడం అంటే కుదరదనే అంటున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతీసారీ జగన్ సభకు రావాలన్న డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి వైసీపీ తీరు అయితే మారలేదు. ఆ పార్టీ ఆలోచనలు దానికి ఉన్నాయి. అయితే సభకు హాజరైతేనే వైసీపీకి మేలు అన్న భావన అయితే సర్వత్రా ఉంది.