Begin typing your search above and press return to search.

జగన్ అరెస్ట్ బీజేపీ లక్ష్యం...ఇదే ఖాయం !

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడం అన్నది కేవలం మర్యాద కోసమే అని అన్నారు.

By:  Satya P   |   26 Oct 2025 10:00 PM IST
జగన్ అరెస్ట్ బీజేపీ లక్ష్యం...ఇదే ఖాయం !
X

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని అరెస్ట్ చేయాలని ఎవరికి ఉంటుంది అంటే ఎక్కువ మంది చెప్పే మాట టీడీపీకే అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య హోరా హోరీ పోరు ఉంటుంది. అధికార మార్పిడి ఈ రెండు పార్టీల మధ్యనే జరుగుతుంది. బీజేపీకి ఏపీలో పెద్దగా బలం అయితే లేదు. ఇక కూటమి కట్టి కొన్ని సీట్లు ఏపీలో గెలుచుకుంది జాతీయ స్థాయిలో అయితే దీర్ఘకాలం బీజేపీ పాలించాలని చూస్తోంది. దానికోసం అన్ని పార్టీలతోనూ సఖ్యతను నెరుపుతోంది. ఏపీ విషయానికి వస్తే అన్నీ పార్టీలు ఎన్డీయే పార్టనర్స్ అనే బీజేపీ ప్రత్యర్ధులు అంటారు. వారు అనడమే కాదు, ఏపీలో కనిపిస్తున్న రాజకీయ దృశ్యం అలాగే ఉంది కూడా. ఆ మధ్యన జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేనతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీయే అభ్యర్ధికే ఓటేశాయి.

కచ్చితంగా అరెస్ట్ :

ఇదిలా ఉంటే ఏపీ కూటమిలో బీజేపీ తరఫున మంత్రిగా వ్యవహరిస్తున్న సత్య కుమార్ యాదవ్ తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ అరెస్ట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ని ఎపుడు అరెస్ట్ చేస్తారు అంటే తొందరలోనే ఏ మాత్రం తడుముకోకుండా సత్య కుమార్ యాదవ్ జవాబు ఇవ్వడం విశేషం. లిక్కర్ స్కాం సహా అనేక విషయాలలో గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అన్ని విధాలుగా దోచేసి సొంత ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. అందుకే దీని మీద కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది అని ఆయన అన్నారు.

సూత్రధారి కూడా :

లిక్కర్ స్కాం లో ఇప్పటిదాకా పాత్రధారులే అరెస్ట్ అయ్యారని సత్య కుమార్ యాదవ్ చెప్పారు. అయితే ఈ కేసుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అది పూర్తి అయినపుడు అన్ని ఆధారాలు లభ్యం అయినపుడు సూత్రధారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన జగన్ అరెస్టు గురించి హింట్ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. బీజేపీ ఏ రకమైన అవినీతిని సహించే ప్రసక్తి లేదని సత్య కుమార్ యాదవ్ గట్టిగా చెప్పారు.

మద్దతు అన్నది మర్యాదకే :

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడం అన్నది కేవలం మర్యాద కోసమే అని అన్నారు. అది రాజ్యాంగబద్ధమైన పదవి అన్నది అంతా గుర్తు ఉంచుకోవాలని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని పదవి కోసం ఏకాభిప్రాయం కోసం బీజేపీ తన వంతుగా ప్రయత్నం చేసింది అన్నారు. ఈ విషయంలో కేవలం వైసీపీని మాత్రమే మద్దతు కోరలేదని మమతా బెనర్జీ వామపక్షాలు మజ్లిస్ పార్టీ ఇలా అందరికీ అడిగామని అన్నారు. రాజ్యాంగ పదవి విషయంలో పోటీ ఉండకూడదు అన్నది బీజేపీ విధానం అని ఆయన చెప్పారు. అంతమాత్రం చేత వైసీపీతో ఏదో తెర వెనక బంధం ఉందని ఎవరూ అనుకోవాల్సిన అవసరం అయితే లేదని ఆయన స్పష్టం చేశారు.

తీవ్ర వ్యాఖ్యలు :

వైసీపీ మీద సత్య కుమార్ యాదవ్ టీడీపీ తరహాలోనే తీవ్ర వ్యాఖ్యమే చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరచారని అయిదేళ్ళ పాలనలో అన్యాయం జరిగిందని అన్నారు. అందుకే వైసీపీ విషయంలో బీజేపీ కూడా ఏ విధమైన సాఫ్ట్ కార్నర్ చూపించేది ఉండదని అన్నారు. కూటమిలోని టీడీపీ సహా ఇతర మిత్రులతో పాటు బీజేపీ కూడా జగన్ అరెస్టుని నూరు శాతం కోరుకుంటోందని అయితే అన్ని ఆధారాలు లభించిన తరువాతనే ఏదైనా జరుగుతుందని ఆయన చెప్పడం విశేషం. ఒక విధంగా ఒక బీజేపీ కీలక నేత జగన్ కి ఫుల్ యాంటీగా ఆయన అరెస్టుని కోరుకుంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒక సంచలనంగానే చెప్పాల్సి ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.