Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో బీజేపీ క్లియర్ ఇండికేషన్ ?

ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో సిట్ దూకుడు చూపిస్తున్న వేళ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Satya P   |   30 July 2025 8:27 PM IST
జగన్ విషయంలో బీజేపీ క్లియర్ ఇండికేషన్ ?
X

వైసీపీ అధినేత జగన్ అరెస్టు విషయంలో పెద్ద ఎత్తున చర్చ అయితే ఏపీలో సాగుతోంది. ఆ మాటకు వస్తే ఈ చర్చ ఇప్పటిది కాదు. మూడు నెలల నుంచి సాగుతూనే వస్తోంది. మహానాడుకు ముందే జగన్ అరెస్టు అన్నారు. ఆ తరువాత మరో ప్రచారం సాగింది. అయితే ఇవేమీ నిజాలు కాలేదు. ఇక జగన్ అరెస్టు విషయంలో ఏదో తెలియని అదృశ్య శక్తి ఆపుతోందని మరి కొన్నాళ్ళు ప్రచారం సాగింది. దాంతో జగన్ అరెస్టు ఉండదని అనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ కీలక నేత ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టుతో మళ్ళీ జగన్ అరెస్ట్ వ్యవహారం చర్చకు వస్తోంది.

దూకుడు వేళ కధనాలు :

ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో సిట్ దూకుడు చూపిస్తున్న వేళ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక వర్గం మీడియాలో అయితే జగన్ అరెస్టుకు కొందరు పెద్దల అడ్డు కారణం అన్నట్లుగా వార్తలు వండి వారుస్తున్నారు. ఏపీలో కూటమిలో బీజేపీ కూడా ఉంది. కానీ కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ కి పరోక్ష సాయం అందిస్తున్నారు అన్నట్లుగా కధనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్యమైన తీరులో ఒక సంచలన కీలక ప్రకటన వెలువడింది.

జగన్ అరెస్టుని ఆపలేరా :

వైసీపీ అధినేత జగన్ అరెస్టుని ఎవరూ ఆపలేరని ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ ఇచ్చారు. మామూలుగా చూస్తే లిక్కర్ స్కాం విషయంలో ఎక్కువగా టీడీపీ నుంచే ప్రకటనలు వస్తూంటాయి. ఆ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు వారే జగన్ అరెస్టు అవుతారు తధ్యమని అంటూంటారు. అయితే ఇపుడు బీజేపీ నుంచి ఈ ప్రకటన రావడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. జగన్ అరెస్టుని ఎవరూ ఆపలేరని కూడా మాధవ్ అంటున్నారు. లిక్కర్ స్కాం లో తప్పులు అనేకం జరిగాయని కాబట్టి జగన్ అరెస్టు కావడం తధ్యమని ఆయన పేర్కొంటున్నారు.

స్పష్టం చేయడానికేనా :

ఉన్నట్లుండి మాధవ్ ఈ విధంగా ప్రకటించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. జగన్ అరెస్టు ఆలస్యం వెనక బీజేపీ పెద్దలు ఉన్నారని వార్తలు వస్తున్న క్రమంలో దానిని గట్టిగా ఏపీ బీజేపీ అధ్యక్ష హోదాలో మాధవ్ ఖండించారా అన్నది ఒక చర్చ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకు అయినా తమ మద్దతు ఉంటుందని బీజేపీ చెప్పినట్లుగా భావించాలా అన్నది మరో చర్చ. అంతే కాదు జగన్ కి కేంద్ర పెద్దల అండ అంటూ వస్తున్న వార్తలు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకే మాధవ్ ఈ విధంగా ప్రకటించి ఉంటారని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక మాధవ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతోంది.

కౌంట్ డౌన్ స్టార్ట్ :

ఇంకో వైపు హైదరాబాద్ లో పదకొండు కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకోవడం ఈ కేసులో ఆధారాలు అన్నీ సిద్ధగా ఉన్నాయని ప్రచారం కావడంతో లిక్కర్ స్కాం మొత్తం మీద అంతిమ లబ్దిదారు ఎవరు అన్నది తొందరలో సిట్ ప్రకటించబోతోంది అని అంటున్నారు. దీంతో జగన్ అరెస్టుకు రంగం సిద్ధం అయినట్లే అని మరో ప్రచారం కూడా ఊపందుకుంది. దాంతో జగన్ ని ఎక్కడ అరెస్టు చేస్తారు అన్నది కూడా చర్చించుకుంటున్నారు. నెల్లూరు పర్యటనలో ఆయన ఉన్నప్పుడా లేక బెంగళూరులో ఉన్నప్పుడా లేక తాడేపల్లిలో ఉన్నప్పుడా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ఆగస్టులో అతి పెద్ద సంచలనం :

ఆగస్టు నెలకు ఏపీకి అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ సంచలనాలు అన్నీ ఇదే నెలలో జరుగుతూ వస్తున్నాయి. దాంతో ఆగస్టు నెలలో అతి పెద్ద రాజకీయ సంచలనంగా జగన్ అరెస్టు ఉంటుందా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. కేంద్రం వైపు నుంచి జగన్ కి ఏ విధమైన అండ లేదని బీజేపీ మాధవ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే అంతా ఉంది అని అంటున్నారు. జగన్ అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా జగన్ అరెస్టుకు అడుగు దూరంలో ఉన్నారని మాత్రం ప్రచారం మొదలైపోయింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.