Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లో వైసీపీ సీన్ ఏమిటి ?

మరో వైపు చూస్తే క్యాడర్ తో కనెక్షన్ ఇంకా గట్టిపడలేదని అంటున్నారు. అయిదేళ్ళ పాలనలో తమను పూర్తిగా పక్కన పెట్టారు అన్న బాధ వారిలో ఉంది.

By:  Satya P   |   16 Aug 2025 10:00 AM IST
గ్రౌండ్ లో వైసీపీ సీన్ ఏమిటి ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రతీ జిల్లాకు వెళ్తున్నారు. అది నాయకుల పరామర్శ కావచ్చు, రైతుల కష్టాలు తెలుసుకోవడం కావచ్చు. జైలులో ఉన్న వారికి ఓదార్పు యాత్ర కావచ్చు, మరో వైపు పెళ్ళిళ్ళకు వెళ్ళి దీవించడం కావచ్చు. ఇలా జగన్ తనకు ఉన్న జన బలం ఎంత ఏమిటి అన్నది అంచనా వేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో తన ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని కూడా ఆయన చెప్పదలచారు. ఈ క్రమంలో జగన్ నెలలో కొన్ని రోజులు ఇదే విధంగా ఎక్కడో ఒక చోటకు వెళ్ళి వస్తున్నారు.

జనాదరణ ఓకే :

ఇక జగన్ పెళ్ళిళ్ళకు వెళ్ళినా జనాలు బయట ఆయనను చూసేందుకు బాగానే తరలివస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు మొన్న జగన్ వెళ్ళారు, దాని కంటే ముందు కర్నూల్ వెళ్ళారు, ఆ తరువాత అనంతపురం తాజాగా వెళ్ళారు. అయితే ఎక్కడకు వెళ్ళినా జనకు ఆదరణ ఉందని జనాల రాక నిరూపిస్తోంది. జగన్ కోసం బయట అభిమానులు కానీ అనుచరులు కానీ పెద్ద సంఖ్యలో రావడం జరుగుతోంది. దీంతో జగన్ కి తిరుగులేదన్న భావన అయితే మెల్లగా ఏర్పడుతోంది.

గ్రౌండ్ లో సన్నివేశం :

అయితే జనాలు రాక అన్నది పార్టీ గ్రాఫ్ పెరగడానికి కొలమానం అవునా కాదా అంటే కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ కి ఎపుడు జనాలు రాలేదు అని ప్రశ్న వస్తుంది. జగన్ ఎన్నికలకు ముందు సిద్ధం సభలకు వెళ్తే పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఒక విధంగా జన సముద్రమే అనిపించింది. కానీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం చేదుగా వచ్చాయి. గట్టిగా చెప్పాలీ అంటే వైసీపీకి దిమ్మతిరిగే రిజల్ట్స్ వచ్చాయి. దాంతో జనాల రాకకు ఓట్ల జాతరకు అసలు ఏ మాత్రం సంబంధం లేదని రుజువు అయింది.

పార్టీ వీక్ గానే :

ఇదిలా ఉంటే వైసీపీ సంస్థాగతంగా వీక్ గానే ఉందని అంటున్నారు పార్టీ ఓటమి పాలు కాకానే చాలా మంది కాడె వదిలేశారు అని అంటున్నారు. ఇక అనేక చోట్ల ఇంచార్జిలను నియమించినా కూడా వారు సైతం పెద్దగా రంగంలోకి దిగడం లేదు. అనేక మంది సొంత పనులలో పడిపోయారు. మరికొందరు అయితే ఇపుడే ఎందుకులే అని ఉదాశీనంగా ఉన్నారు. పార్టీ పదవులు ఎన్ని ఉంటే అన్నీ వైసీపీ పెద్దలు పంచేసిన తరువాత కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్ సన్నివేశంగా ఉంది.

క్యాడర్ తో కనెక్షన్ ఎలా :

మరో వైపు చూస్తే క్యాడర్ తో కనెక్షన్ ఇంకా గట్టిపడలేదని అంటున్నారు. అయిదేళ్ళ పాలనలో తమను పూర్తిగా పక్కన పెట్టారు అన్న బాధ వారిలో ఉంది. అందుకే వారు దూరంగా ఉంటున్నారు పెద్ద ఎత్తున క్యాడర్ డీ మోరలైజ్ అయింది. దాని వల్లనే పులివెందుల లాంటి చోట్ల సైతం వారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడంలేదని చెబుతున్నారు. క్యాడర్ గట్టిగా ఉంటే ఢీ అంటే ఢీగా పోరు ఉండేదని చెబుతున్నారు కానీ వారు నెమ్మదించడం వల్లనే అలాంటి ఫలితం వచ్చిందని కూడా విశ్లేషిస్తున్నారు.

నేల విడిచి సాముగా :

ఏ పార్టీ నాయకత్వం అయినా వాస్తవ అరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. అంతే తప్ప నేల విడిచి సాము చేయకూడదు, అధినాయకత్వానికి ప్రజాకర్షణ ఉండడం అన్నది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అన్నింటికీ అదే పరిష్కారం కాదు. క్యాడర్ ప్లస్ లీడర్ ప్లస్ జనాకర్షణ ఇవ్వే పార్తీ విజయానికి దగ్గర మార్గాలు. అలా చూస్తే కనుక వైసీపీ క్యాడర్ లీడర్ ని దారిలోకి తెచ్చుకుని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు అది జరగకుండా పైపైన ఎన్ని పర్యటనలు చేసి జనాల జాతరతో బలముందని మురిసిపోయినా ఫలితం మాత్రం అనుకున్న విధంగా వస్తుందా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి అధినాయకత్వం ఏ ఆలోచనలు చేస్తుందో.