23 లో వైసీపీ ఆశలు...టఫ్ ఫైట్ ఖాయమా ?
ఏపీలో ఈ నెల 26న జరగనున్న నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. జగన్ ఆదేశాలతో మేయర్, చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసింది. శ్రీకాకుళం, కాకినాడ సహా పలు స్థానాల్లో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉండగా, మొత్తం 23 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
By: Satya P | 17 Nov 2026 9:37 AM ISTఏపీలో వాయిదా పడిన నాలుగు కార్పోరేషన్లు, అలాగే 19 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 26న ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించడంలో కూటమి వైసీపీ పోటీ పడుతున్నాయి. తాజాగా వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు చైర్మన్ అభ్యర్థులను పార్టీ పెద్దలు ప్రకటించారు. వివిధ రకాలైన సామాజిక రాజకీయ సమీకరణలతో వైసీపీ అభ్యర్థులను నిర్ణయించింది అని అంటున్నారు.
వీరే అభ్యర్ధులుగా :
ఇక ముందుగా కార్పోరేషన్ల అభ్యర్ధుల గురించి చూస్తే శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి, కాకినాడ మేయర్ అభ్యర్థిగా సత్యశ్రీ రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా డి వెంకట్రావ్, మంగళగిరి-తాడేపల్లి మేయర్ అభ్యర్థిగా పి. నాయక్‌లను నిర్ణయించారు. ఇక ఆముదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతాకుమారి, రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పాలవలస పద్మావతి, భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వెంకట మాధవీలత, పాలకొల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఉమాశైలజా, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జి శ్రీనివాస్, తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బలరామకృష్ణ, గుడివాడ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎం ప్రవీణ, వైఎస్సార్ తాడిగడప మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బి వీరబాబు, నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ ఖాజావలి, పొన్నూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నాసర్, బాపట్ల చైర్మన్ అభ్యర్థిగా కె సుధీర్‌బాబు, కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కె శివకుమార్‌రెడ్డి, చింతలపూడి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పి సునీతలను ఎంపిక చేశరు.
వైసీపీ అంచనా :
అయితే మొత్తం 23 చోట్ల అభ్యర్ధులను అర్బన్ బాడీస్ మలి విడత ఎన్నికల్లో వైసీపీ ప్రకటించింది కానీ ఆ పార్టీకి కొన్ని చోట్ల గెలుపు ఆశలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం మేయర్ సీటుని గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది అని అంటున్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు సామాజిక అంశాలు కూటమి పొత్తులు ఇవన్నీ కలిసి వస్తాయని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. ఇదే రకంగా సామాజిక సమీకరణల విషయంలో కాకినాడలో ప్రయోగం చేసింది అని చెబుతున్నారు. అక్కడ తాము బాగానే పోటీ ఇస్తామని అంటోంది. మునిసిపాలిటీల విషయంలో కూడా తాము కొన్ని గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
క్లీన్ స్వీప్ అంటూ :
అయితే వైసీపీ ఆశలు ఇలా ఉంటే కూటమి మాత్రం క్లీని స్వీప్ చేస్తామని అంటోంది. మొత్తం 23 కి 23 సీట్లూ కూటమి ఖాతాలో పడతాయని మూడు పార్టీలు నమ్మకంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే జరిగిన మునిసిపల్, పరిషత్తు ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుకుందని అదే మరోసారి రిపీట్ అయి మంచి ఫలితాలు వస్తాయని సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తమదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు మరోసారి ఆసక్తిని పెంచుతున్నాయి.
