ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. 17 మున్సిపాలిటీల్లో వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదని, బెదిరింపులు, పోలీసుల వేధింపులతో ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకున్నారని విమర్శించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సంఘం అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించారు.
By: A.N.Kumar | 5 Nov 2026 6:20 PM ISTస్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెలరేగిన దుమారం మాత్రం చల్లారడం లేదు. ఎన్నికల ఫలితాల కన్నా ఆ ప్రక్రియ నిర్వహించిన తీరుపైనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని అధికార కూటమి తమ పాలనకు లభించిన అపార ప్రజా మద్దతుగా పేర్కొంటుంటే... ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మాత్రం ఇది ప్రజాస్వామ్య విజయం కాదని.. ప్రజాస్వామ్యానికే పట్టిన గ్రహణమని మండిపడుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన తీవ్ర ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజేశాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంటే కేవలం ఒక షెడ్యూల్ విడుదల చేయడం.. పోలింగ్ జరిపి ఫలితాలు ప్రకటించడం మాత్రమే కాదు. ప్రతీ అభ్యర్థికీ స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు.. ప్రతి ఓటరుకూ ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు వేసే వాతావరణం ఉండాలి. అయితే ఏపీలో ఇటీవల ముగిసిన స్థానిక పోరులో ఈ ప్రాథమిక సూత్రాలకే మోక్షం లేదని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. వేలాది మంది కార్యకర్తలను బైండోవర్ చేయడం, పోటీ చేయాలనుకున్న అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. ఒకవేళ వేసినా సాంకేతిక కారణాల పేరుతో తిరస్కరించడం.. బెదిరింపులతో బలవంతంగా ఉపసంహరింపజేయడం వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదని.. మొత్తం 22 మున్సిపాలిటీల్లో నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా ఏకపక్షం చేశారని తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో సైతం కేవలం 20 వార్డులకే పరిమితమయ్యేలా అడ్డుకున్నారని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే తీరు పునరావృతమైందని.. 80 జెడ్పీటీసీ స్థానాల్లో 2,000కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షాలను పోటీకి కూడా రానివ్వకపోతే వాటిని ఎన్నికలు అంటారా? లేక ఏకపక్ష ఎంపికలు అంటారా?" అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల నిష్పక్షపాత నిర్వహణలో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు వ్యవస్థ.. జిల్లా యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి సహకరించాయని జగన్ ఆరోపించారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీల నుంచి రిటర్నింగ్ అధికారుల వరకు అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు.
ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపైనా జగన్ ప్రశ్నలు కురిపించారు. బ్యాలెట్ బాక్సుల రవాణా.. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లకు అనుమతి నిరాకరణ.. ఫలితాల ప్రకటనలో అవకతవకలపై ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆరోపించారు.
ఎన్నికల ముగింపు వేళ జగన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. మరి వీటిపై అధికార టీడీపీ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.
