Begin typing your search above and press return to search.

పాత ప్లాన్ నే కొత్తగా అమలు చేసే పనిలో జగన్

జగన్ విషయం తీసుకుంటే ఆయన కాంగ్రెస్ కి దూరం. ఎప్పటికీ ఆ పార్టీతో కలవని పార్టీగా వైసీపీ ఉంది. ఇక బీజేపీకి కాంగ్రెస్ అంటే బద్ధ శత్రువు.

By:  Satya P   |   27 Jan 2026 9:18 AM IST
పాత ప్లాన్ నే కొత్తగా అమలు చేసే పనిలో జగన్
X

వైసీపీ అధినేత జగన్ 2029 ఎన్నికల మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని ఆయన లెక్కలు అయితే బాగానే వేసుకుంటున్నారు. దానికి కారణాలు అవకాశాలు ఆయనకు మాత్రమే తెలుసు అని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో జరిగిందే మరోసారి జరగవచ్చు అన్నది ఆయన ఆలోచనగా ఉంది అని అంటున్నారు. అలా జరగకపోయినా 2024 మాదిరిగా కీడు అయితే అసలు జరగదని ఆయన భావిస్తున్నారుట.

బీజేపీ వైపే చూపు :

బీజేపీకి ఈసారి అంటే 2029 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాదని అంతా అంటున్నారు. దానికి నిదర్శనం 2024 ఎన్నికలు అని చెబుతున్నారు. మూడవసారి పోటీ చేస్తే ఏకంగా 240 లోపు సీట్లు వచ్చాయి. మెజారిటీకి ముప్పయి కి పైగా సీట్ల దూరంలో ఆగిపోయింది. మరి 2029 అంటే ఏకంగా పదిహేనేళ్ల పాటు బీజేపీ పాలన అన్న మాట. దాంతో బీజేపీ మీద వ్యతిరేకత భారీగానే ఉండొచ్చు అని అంచనా ఉంది. ఈసారి కూడా 200 పైగా సీట్లు వస్తే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది. కానీ మరీ డెబ్బైకి పైగా ఎంపీలు తక్కువ పడితే అది ఎన్డీయే కూటమితో కూడా సాధ్యపడదు, అపుడు జగన్ లాంటి తటస్థ మిత్రుల మీద కూడా ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు. ఈ ధీమాతోనే వైసీపీ కూడా ఒంటరి పోరుకు సిద్ధం అవుతూ కేంద్ర బీజేపీ పెద్దలతో సానుకూలంగా ఉండేందుకు ఇప్పటి నుంచే చూస్తోంది అని ప్రచారం అయితే సాగుతోంది.

నమ్మకమైన తీరులో :

జగన్ విషయం తీసుకుంటే ఆయన కాంగ్రెస్ కి దూరం. ఎప్పటికీ ఆ పార్టీతో కలవని పార్టీగా వైసీపీ ఉంది. ఇక బీజేపీకి కాంగ్రెస్ అంటే బద్ధ శత్రువు. ఈ కామన్ పాయింట్ తోనే జగన్ బీజేపీని కేంద్ర పెద్దలను తన వైపు తిప్పుకునేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. జగన్ వైపు నుంచి అయితే సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారని అంటున్నారు. గడచిన ఇరవై నెలలలో కూడా కేవలం టీడీపీని మధ్యలో జనసేనను విమర్శించిన జగన్ బీజేపీని అసలు ఏమీ అనడం లేదు, దాని వెనక దూరాలోచన ఉందని అంటున్నారు. బీజేపీతో వైరం వద్దు అన్న సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు.

మనసులోని మాటతో :

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. దీని కోసం కేంద్ర పెద్దల సాయం కూడా ఆశిస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. రేపటి రోజున ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని బీజేపీలో కీలక నేతలకు మనసులోని మాటను చేరవేసినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అయితే బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. వారికి ఏపీలో మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్ల బలం కావాలి. జగన్ కి ఏ విధంగా సహకరించినా టీడీపీ వైపు నుంచి సహకారం ఉండదు, పైగా పొత్తులో ఉన్న పార్టీగా బీజేపీ కీలకంగా ఉంటుంది. అదే టీడీపీ కూటమిలో ఉన్నా వైసీపీకి బీజేపీ వైపు చూడడం అనివార్యంగా ఉంటుంది. అది జగన్ కి కాంగ్రెస్ వ్యతిరేకత అనే బలహీనతగా చూస్తున్నారు. మరి జగన్ కానీ వైసీపీ వ్యూహకర్తలు కానీ బీజేపీ నుంచి పరోక్షంగా అయినా సాయం ఆశించడం అన్నది కానీ ఆ తరహా ఆలోచనలు కానీ గెలుపుని అందించే వ్యూహాలేనా అంటే చూడాల్సి ఉంది అంటున్నారు.