Begin typing your search above and press return to search.

జగన్ న్యూ స్ట్రాటజీ ...ఈసారి చావో రేవో !

ఈసారి అధికారంలోకి రావడం వైసీపీకి చాలా అవసరం. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ వరుసగా రెండు సార్లు ఓటమి పాలు అయితే ఇక కష్టం అన్న విశ్లేషణలు ఉన్నాయి.

By:  Satya P   |   31 July 2026 11:37 PM IST
జగన్ న్యూ స్ట్రాటజీ ...ఈసారి చావో రేవో !
X

ఈసారి అధికారంలోకి రావడం వైసీపీకి చాలా అవసరం. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ వరుసగా రెండు సార్లు ఓటమి పాలు అయితే ఇక కష్టం అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే వైసీపీ అధినాయకత్వం కూడా 2029 ఎన్నికలు ఆషామాషీగా తీసుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటిదాకా టికెట్ల విషయంలో కూడా ఎవరికీ భరోసా ఇవ్వడం లేదని అంటున్నారు. అంతే కాదు పార్టీని బూత్ లెవెల్ వరకూ పటిష్టం చేయాలని కూడా జగన్ చూస్తున్నారు. తాను అపుడపుడు జనంలోకి వచ్చినా ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉండాలని తలపోస్తున్నారు. అధికార కూటమితో పాటు జనం అంతా దాని గురించే కొన్ని రోజులు మాట్లాడుకునే విధంగా తన టూర్ ప్రోగ్రాంస్ ని ఈ మధ్య జగన్ డిజైన్ చేసుకుంటున్నారు. దాని వెనక ఒక వ్యూహంతో పాటు వ్యూహకర్త కూడా ఉన్నారని అంటున్నారు.

అచ్చి వచ్చిన వారితోనే :

వైసీపీ 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త వ్యూహకర్తను నియమించుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ వ్యూహకర్త ఎవరో కాదు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి తీసుకుని రావడానికి కారణం అయిన సాహూ అని అంటున్నారు. ఇంతకీ ఎవరీ సాహూ అంటే పూర్తి పేరు కపిల్ సాహూ అని అంటున్నారు. ఆయన ఒకప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకంగా ఉన్న వారే అని అంటున్నారు. ఆ తరువాత తనకంటూ సొంతంగా పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్ అన్న పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు అని అంటున్నారు.

ఏరి కోరి మరీ :

అయితే తమిళనాడు ఎన్నికలో సరికొత్తగా ప్రచారం చేయడమే కాకుండా యూత్ ని ఎక్కడికక్కడ కనెక్ట్ చేస్తూ అటు మహిళా ఓట్లను కూడా కన్సాలిడేట్ చేయడంతో కపిల్ సాహూ వ్యూహాలు విజయ్ గెలుపునకు ఎంతగానో పనికి వచ్చాయని అంటున్నారు. అంతే కాకుండా విజయ్ ఎన్నికల ప్రచారం కూడా పూర్తిగా కొత్త రూట్ లో సాగింది. ఎక్కువగా డిజిటల్ మీడియాను ఉపయోగించుకున్నారు. ఇక విజయ్ హోలోగ్రామ్ తో ప్రచారం చేశారు. మొత్తం అన్ని నియోజకవర్గాలలో విజయ్ ప్రసంగాలు చేస్తున్నట్లుగా ఆయన బొమ్మలతో ఆయన వాయిస్ తో జనం ముందుకు వచ్చిన సరికొత్త వ్యూహం కూడా కపిల్ సాహూదే అని అంటున్నారు. ఏపీలో వైసీపీకి పనిచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన సాహూ జగన్ కోసం వినూత్నమైన పంధాలో ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.

డేటా రెడీ చేస్తూ :

ఇక ఇప్పటికే రంగంలోకి దిగిన కపిల్ సాహూ టీం మొత్తం ఏపీలోని 175 నియోజకవర్గాలలో వైసీపీ ప్రస్తుత బలాలు బలహీనతలు మీద ఒక డేటాని రెడీ చేసి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ గ్రాఫ్ ఎలా ఉందో కూడా నివేదికలు సిద్ధం చేసి ఇచ్చారని చెబుతున్నారు. జగన్ పర్యటనలను కూడా ఈ టీం డిజైన్ చేస్తోంది అని అంటున్నారు. జగన్ పరామర్శ యాత్రలు చేసినా వాటిని రోడ్ షోలుగా మార్చడం వ్యూహంలో భాగం అని అంటున్నారు. అలాగే శ్రీకాకుళం టూర్ లో సరిగ్గా భోగాపురం వద్దకు వచ్చేసరికి థాంక్యూ జగన్ అన్న ప్ల కార్డులు ప్రదర్శించడం ఎయిర్ పోర్టు క్రెడిట్ జగన్ ది అని చెప్పడం వెనక సాహూ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. విపరీతమైన జనాలు జగన్ కోసం వచ్చారని వారు జాతర చేశారని జగన్ క్రేజ్ ఇమేజ్ టాప్ రేంజిలో ఉన్నాయని ఏపీలో చూపించడం కూడా స్ట్రాటజీ అంటున్నారు.

ఓపెనింగ్ కి ముందుగానే :

భోగాపురం ఎయిర్ పోర్టు ని ఆగస్టు 1న ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే జగన్ టూర్ ఉత్తరాంధ్రాలో పెట్టడం వెనక కూడా సాహూ బృందం వ్యూహం ఉందని అంటున్నారు. ఆ విధంగా జనం అంతా తమ వైపు ఉన్నారని ఒక రాజకీయ బల ప్రదర్శన చేశారని కూటమి సభకు జనాలు ఎంత మంది వచ్చినా దాని కంటే ముందే తమకు స్వచ్చందంగా జనాలు వచ్చారని చెప్పుకోవడానికి వైసీపీకి కలసివచ్చే విధంగా ఈ టూర్ డిజైన్ చేశారు అని అంటున్నారు. రానున్న కాలంలో ఈ తరహా వినూత్నమైన వ్యూహాలతో సాహూ టీం జగన్ ని జనంతో కనెక్ట్ చేస్తుందని అంటున్నారు. 2029 ఎన్నికలకు వైసీపీకి సక్సెస్ ఫుల్ వ్యూహకర్త అయితే దొరికారు, మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.