డ్రంక్-డ్రైవ్ లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన స్థాయి నుంచి లోకల్ పోలీసుల చేతిలో అరెస్టయ్యే స్థితికి వచ్చాడు.
By: Tupaki Political Desk | 28 Jan 2026 6:53 PM ISTటీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన స్థాయి నుంచి లోకల్ పోలీసుల చేతిలో అరెస్టయ్యే స్థితికి వచ్చాడు. పీకల దాక తాగి అతడు చేసిన పనికి ఇప్పుడు కేసును ఎదుర్కొంటున్నాడు. ఎంతటి వ్యక్తి అయినా.. నియంత్రణ లేకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుందని ఈ ఉదంతం చెబుతోంది. విలాసవంతమైన జీవితంలో అదుపుతప్పితే కష్టాలు తప్పవని చాటుతోంది. జీవితంలో ఎదిగేకొద్దీ అణిగి ఉండాలని స్పష్టం చేస్తోంది. విపరీతమైన పోటీ ఉండే భారత దేశ క్రికెట్ జట్టుకు ఆడడం అంటే.. అతడు వ్యక్తిగా ఎంతో సాధించినట్లు. కానీ, తాజా పరిణామంతో తప్పు చేశాడు.
ఆ డజను మందిలో ఒకడు..
గుజరాత్ కు చెందిన క్రికెటర్ జాకబ్ మార్టిన్ టీమ్ఇండియాకు 10 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 158 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ ల హయాంలో 1999-2001 మధ్య దేశానికి ఆడిన అతడు తర్వాత క్రమంగా దూరమయ్యాడు. ఓ దశంలో రంజీ సీజన్ లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు. ఈ ఘనత భారత్ లో కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు 53 ఏళ్ల జాకబ్ మార్టిన్ తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు తప్ప తాగి తన ఎస్ యూవీ వాహనాన్ని నడిపిన జాకబ్ మార్టిన్... నిలిపి ఉంచిన ఇతర వాహనాలను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇదంతా గుజరాత్ లోని వడోదరలో జరిగింది. అక్కడి అకోటా పోలీసుల కథనం ప్రకారం.. పునిత్ నగర్ సొసైటీ సమీపంలో జాకబ్ మార్టిన్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. భవనం బయట ఉన్న వాహనాలపైకి తన ఎస్ యూవీని పోనిచ్చాడు. దీంతో మూడు కార్లు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరకుని.. జాకబ్ మార్టిన్ ను పరీక్షించగా తాగి ఉన్నట్లు తేలింది.
కేసులో చిక్కి.. పోలీసు ముందు కూర్చుని..
ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్ తో కలిసి మ్యాచ్ లు ఆడిన జాకబ్ మార్టిన్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయి.. పోలీసుల ముందు కూర్చోవాల్సి వచ్చింది. ఎవరైతే తాను దేశానికి క్రికెట్ ఆడే సమయంలో తనను టీవీలో చూశారో.. బహుశా వారి ఎదుటే జాకబ్ మార్టిన్ ఇలా కూర్చోవాల్సి రావడం విధి అనుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన అతడిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. అతి వేగంతో పాటు మద్యం తాగి వాహనం నడిపినట్లు అభియోగాలు మోపారు. మార్టిన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పుడే కాదు గతంలోనూ జాకబ్ మార్టిన్ పై పలు ఆరోపణలు వచ్చాయి. 2011లో అతడు మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యాడు. తాజా పరిణామంతో జాకబ్ మార్టిన్ వివాదాస్పద చరిత్ర మరోసారి చర్చనీయం అయింది.
